టోకరా | - | Sakshi
Sakshi News home page

టోకరా

Published Tue, Feb 18 2025 1:03 AM | Last Updated on Tue, Feb 18 2025 1:02 AM

టోకరా

టోకరా

విదేశీ ఉద్యోగాల పేరిట

విదేశీ ఉద్యోగాల పేరిట మోసపోయిన నిరుద్యోగులు

అప్పు చేసి డబ్బులు చెల్లించాను

మాది టెక్కలి మండలం గోకర్లపల్లి. ఇటలీలో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతుందని స్నేహితుల ద్వారా తెలుసుకొని రెండో బ్యాచ్‌గా ఇచ్ఛాపురం సూర్యా లాడ్జిలో మొదటి విడతగా రూ.30వేలు చెల్లించాను. తర్వాత హైదరాబాద్‌లో రూ.1.28లక్షలు ఇచ్చాను. ఇటలీలో మంచి ఉద్యోగం అని చెప్పడంతో మా పేరెంట్స్‌ అప్పు చేసి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అంతా బోగస్‌ అంటున్నారు.

– పడాల గణేష్‌, టెక్కలి మండలం

స్థానికుల పరిచయంతో బలయ్యా..

ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామం మాది. డిగ్రీ వరకు చదువుకున్నాను. ఏజెంట్‌ ధర్మరాజు మా పక్క ఒడిశాకు చెందిన వ్యక్తి కావడంతో పాటు మా ప్రాంతంలో ఏజెంట్‌కు బంధువులు ఉండటంతో వారి ద్వారా నమ్మి ఇచ్ఛాపురం లాడ్జీలో రూ.50వేలు చెల్లించాను. ఇటలీలో వైన్‌ ప్యాకింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఇచ్ఛాపురం గవర్నమెంట్‌ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ల్యాబ్‌లో మాకు మెడికల్‌ టెస్ట్‌లు జరిగాయి. ఈ రోజు ఉదయం ‘అంతా బోగస్‌...మోసపోయాం’ అంటూ మెసేజ్‌ పెట్టడంతో మాకుతెలిసింది. మాకు న్యాయం జరగాలి. – సాహుకారి భానుప్రకాష్‌,

ధర్మపురం, ఇచ్ఛాపురం మండలం

ఇచ్ఛాపురం రూరల్‌: ఇచ్ఛాపురం కేంద్రంగా జరిగిన ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట సుమారు 350 మందికి టోకరా వేసి సుమారు ఆరున్నర కోట్ల రూపాయలతో ఓ ప్రబుద్ధుడు పరారయ్యాడు. ఇచ్ఛాపురానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా చీకటి బ్లాక్‌ పార్వతీపురం గ్రామానికి చెందిన కొచ్చెర్ల ధర్మరాజు పోలెండ్‌లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. ఏజెంట్‌గా అవతారం ఎత్తి స్థానిక యువకులతో ఉన్న బంధుత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇటలీలో మంచి ఉద్యోగాలు ఉన్నాయని స్థానికులైన కాయి దిలీప్‌(తేలుకుంచి), శ్రీను(బెజ్జిపద్ర)లతో ఉన్న బంధుత్వంతో ప్రచారం చేసుకున్నాడు. ఫ్రూట్స్‌ కటింగ్‌, ప్యాకింగ్‌, వైన్‌, బీర్లు కంపెనీలో ప్యాకింగ్‌ వంటి ఆకర్షణీయమైన ఉద్యోగాలు, కష్టం లేని పని, రూ.లక్షల్లో జీతం అంటూ నమ్మబలకడంతో జిల్లా నుంచి సుమారు 350 మంది వరకు ఈయన వలలో పడ్డారు. ఇచ్ఛాపురం కేంద్రంగా ఓ లాడ్జిని తీసుకొని తొలి విడతలో గత ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి వారి దగ్గర రూ.ఇరవై వేలు అడ్వాన్స్‌, తర్వాత రూ.1.35 లక్ష లు చొప్పున వసూలు చేశాడు. అలాగే నెల తిరక్క ముందు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ పేరిట 175 మంది వద్ద రూ.1.35 లక్షలు చొప్పున, ఈ ఏడాది జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి శ్రీమారుతీ ఇన్‌స్టిట్యూట్‌లో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి వారి వద్ద నుంచి రూ.50వేలు చొప్పున వసూలుతో పాస్‌ఫొటోలు తీసుకున్నాడు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఇటలీ వెళ్లేందుకు సిద్ధం కావాలని నమ్మబలికాడు. ఇచ్ఛాపురం పట్టణలోని ఓ మెడికల్‌ ల్యాబ్‌లో 350 మంది యువకులకు మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించి యువకులను మరింత నమ్మించాడు. ఈ మెడికల్‌ టెస్ట్‌లో ఒక్కోక్కరి వద్ద రూ.2,500 నుంచి రూ.3,200 వరకు వసూలు చేసినట్లు యువకులు విలేకరులకు తెలిపారు.

అంతా బోగస్సే..

ఇటలీ వెళ్లేందుకు మొదటి విడతలో 30 మంది ఢిల్లీ వచ్చి పాస్‌పోర్టు చెకింగ్‌, స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని కోరడంతో జిల్లా నుంచి శుక్రవారం ఢిల్లీ వెళ్లిన యువకులకు ఆదివారం రాత్రి పిడుగులాంటి వార్త చెవిన పడింది. ఇక్కడ ఇలాంటిది ఏమీ లేదని, అంతా బోగస్‌ అని తెలియడంతో లబోదిబోమన్నారు. ఇటలీ వెళ్లేందుకు డబ్బులు చెల్లించిన నిరుద్యోగుల గ్రూపులో సోమవారం ఉదయం ఏజెంట్‌ ధర్మరాజు వాయిస్‌ మెసేజ్‌ పెడుతూ ‘సారీ గయ్స్‌... మనమంతా మోసపోయాం. మీతో పాటు నేనూ కూ డా మోసపోయాను’ అంటూ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయ డంతో అందుబాటులో ఉన్న యువకులంతా సోమ వారం ఇచ్ఛాపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న సీఐ ఎం.చిన్నంనాయుడును కలసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. తామంతా మోసపోయామని, తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. పట్టణం పోలీస్‌ స్టేషన్‌లో బాధిత యువకులు ఫిర్యాదు చేసినట్లు బాధిత యువకులు తెలిపారు.

జిల్లాలో 350 మంది బాధితులు

ఇచ్ఛాపురం కేంద్రంగా మోసం

No comments yet. Be the first to comment!
Add a comment
టోకరా 1
1/4

టోకరా

టోకరా 2
2/4

టోకరా

టోకరా 3
3/4

టోకరా

టోకరా 4
4/4

టోకరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement