బైక్‌ను ఢీకొన్న గుర్తు తెలియని జంతువు
● తీవ్ర గాయాలపాలై వ్యక్తి మృతి
సోంపేట: మండలంలోని సుంకిడి పంచాయతీ రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నర్సింగ్ మహంతి (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్ మహంతి కుమారుడు జగదీష్ ఐటీఐ చదువుతున్నాడు. జగదీష్ కొర్లాం వద్దకు బస్సులో రాగా.. కుమారుడిని తీసుకురావడానికి నర్సింగ్ సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. బుసాబద్ర పంచాయతీ వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని జంతువు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నర్సింగ్ కిందపడి గాయపడ్డాడు. 108 సిబ్బంది వచ్చేసరికే మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
బుడితి సచివాలయంలో ఒకే ఒక్కడు
సారవకోట: మండలంలోని బుడితి సచివాలయానికి ఎంపీడీఓ మోహన్ కుమార్ మంగళవారం ఉదయం 10.10 గంటలకు తనిఖీ చేయడానికి వచ్చారు. ఆ సమయానికి వీఆర్‌ఓ తప్ప ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 10 నిమిషాల వ్యవధిలో పంచాయతీ కార్యదర్శి హాజరు కాగా ఇతర సిబ్బంది ఏ ఒక్కరూ రాలేదు. ఒక్క బుడితిలోనే కాకుండా అన్ని సచివాలయాలలో ఇదే తంతు నడుస్తుందని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయ పడుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై సెక్టార్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని తెలిపారు. ఈనెల 27న జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, సి–సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బైక్‌ను ఢీకొన్న గుర్తు తెలియని జంతువు
Comments
Please login to add a commentAdd a comment