నువ్వలరేవులో విషాదం
కంచిలి/వజ్రపుకొత్తూరు రూరల్: కంచిలి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బెహరా ధర్మారావు(31), బెహరా సన్నా అలియాస్ షణ్ముఖరావు(38) మృతిచెందడంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఎదురుగా వెళుతున్న ట్రాక్టర్‌ను తాము ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ధర్మారావు స్వగ్రామంలో టైలరింగ్ చేస్తుండేవాడు. అతని సహాయకుడిగా సన్నా పనిచేస్తుండేవాడు. వీరిద్దరూ రెడీమేడ్ దుస్తుల్ని కుట్టి బరంపురంలోని హోల్‌సేల్ వ్యాపారులకు ఆర్డర్‌పై అందిస్తుడేవారు. ఈ క్రమంలోనే బరంపురం వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
లబోదిబోమంటున్నకుటుంబాలు..
ధర్మారావుకు భార్య పూజ, కుమారుడు మున్నా, కుమార్తె వర్షిణి ఉన్నారు. సన్నాకు భార్య శృతి, మూడేళ్ల కుమారుడు రోషన్ ఉన్నారు. వీరంతా విషాదంలో మునిగిపోయారు. మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు సోంపేట సామాజిక ఆసుపత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఇద్దరు యువకుల మృతితో నువ్వలరేవులో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు మంగళవారం గ్రామానికి చేరడంతో అశృనయానాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్, ఎంపీటీసీలు, మత్య్సకార సొసైటీ సభ్యులు, గ్రామపెద్దలు మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అశ్రునయనాల మధ్య రోడ్డు ప్రమాద మృతుల అంత్యక్రియలు
బాధిత కుటుంబాలకు పలువురి పరామర్శ
నువ్వలరేవులో విషాదం
నువ్వలరేవులో విషాదం
Comments
Please login to add a commentAdd a comment