కన్నీళ్లకే.. కన్నీళ్లొచ్చే..!
నందిగాం: ఆడపిల్ల పుట్టిందని నాడు తండ్రి విడిచిపెట్టి వెళ్లిపోయాడు. జీవితాంతం తోడు ఉంటానని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త రెండేళ్లకే వదిలేశాడు. అయినా ధైర్యం కోల్పోక ముందుకు సాగుతున్న ఆమెకు కిడ్నీ భూతం కాటేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. విధి చేతిలో ఓడిపోయి నిస్సహాయ స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్న కాంతమ్మ దీనస్థితి ఇది. వివరాల్లోకి వెళ్తే.. నందిగాం మండలం మర్లపాడుకు చెందిన కోనారి వెంకయ్య, నీలమ్మల కుమార్తె కాంతమ్మ. అయితే కాంతమ్మ పుట్టిన తర్వాత మగబిడ్డ పుట్టలేదని చెప్పి తండ్రి వెంకయ్య కోపంతో భార్య, కుమార్తెను విడిచిపెట్టి మరో మహిళతో వెళ్లిపోయాడు. దీంతో పేదరికంలో పెరిగిన కాంతమ్మ కూలి పనులు చేసుకుంటూ తల్లికి తోడుగా ఉండేది. పెళ్లి ఈడు వచ్చేసరికి గ్రామస్తులు సహకరించి సమీప ప్రతాపవిశ్వనాథపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం చేశారు. అయితే తాగుడుకు బానిసైన ఆయన రెండేళ్లకే భార్యను విడిచిపెట్టడంతో కాంతమ్మ మరలా కన్నవారింటికి చేరింది.
కూలి పనులతోనే జీవనం
కూలీ పనులు, ఉపాధి పనులు చేసుకుంటూ తల్లి ఉంటున్న పూరి గుడిసెలో కాంతమ్మ జీవనం సాగిస్తుండేది. వదిలి వెళ్లిన తండ్రి ఐదేళ్ల క్రితం గ్రామ సమీప తోటలో శవంగా మరడంతో కుమారుడిలా అంత్యక్రియలు చేసి కన్నరుణం తీర్చుకుంది. విడిచిపెట్టిన భర్త కొద్దిరోజులకే చెరువులో పడి విగతజీవిగా మారాడు. తల్లి వృద్ధాప్యానికి చేరుకొని కంటి సమస్యతో కుమార్తె కాంతమ్మ మీద ఆధారపడింది. అయినప్పటికీ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొని తల్లికి సపర్యలు చేసుకుంటూ జీవనం సాగించేది. అయితే రెండేళ్ల క్రితం కిడ్నీ భూతం కాంతమ్మకు సోకింది. మొదటిలో కూలీ చేసిన డబ్బులతో వైద్యం పొందేది. అయితే క్రమేపీ వ్యాధి తీవ్రత పెరిగి కూలీ చేసుకోలేని స్థితికి చేరుకుంది. దీంతో గ్రామంలోని కొంతమంది యువకులు ఆర్థిక సాయం చేస్తూ పలాసలో ఉన్న కిడ్నీ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇటీవల వ్యాధి తీవ్రత బాగా పెరగడంతో కాంతమ్మ మంచానికే పరిమితమైపోయింది. ఫలితంగా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు. పూట గడవడమే కష్టంగా మారిన స్థితిలో డయాలసిస్ చేయించుకునే స్థోమత లేకుండా పోయింది. దీంతో జీవితంలో ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నా, ఎక్కడా చేయిచాచని కాంతమ్మ విధికి తలవంచి దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. మనసున్న మారాజులు ఎవరైనా ఆదుకోవాలని కోరుతోంది. తనకు సాయం చేయాలనుకునేవారు 9440487406 నంబర్‌ను సంప్రదించాలని కోరుతోంది.
పేద మహిళకు పెద్దకష్టం
కిడ్నీవ్యాధి సోకడంతో ఇబ్బందులు
దాతలు ఆదుకోవాలని వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment