ఫుల్ టైమ్ ఫ్రాడ్
పార్ట్ టైమ్ జాబ్..
● పార్ట్ టైమ్ జాబ్ పేరిట సైబరాసురుల వల ● అమాయకుల పేరిట బ్యాంకు ఖాతాలు, సిమ్‌లు ఓపెన్ చేసి సొమ్ము చేసుకుంటున్న వైనం
శ్రీకాకుళం క్రైమ్ :
నరసన్నపేటలో ఓ వ్యక్తి తన ఇన్‌స్ర్ట్రాగామ్‌లో తెలియని లింక్ రావడంతో ఓపెన్ చేశాడు. ఓ వెబ్ పేజీ ఓపెన్ అయ్యింది. పార్ట్‌టైమ్ జాబ్ చేసుకోవచ్చని చేయాల్సిందల్లా టాస్క్‌లు క్లియర్ చేయడమేనని మెయిల్‌లో రావడంతో ఓకే చేశాడు. మొదట్లో తన అకౌంట్‌లో డబ్బులు పడ్డాయి. తర్వాత రూ.7.50 లక్షల వరకు లాగేశారు. మోసపోయానని తెలుసుకున్నలోపే అంతకుముందు అతని నంబర్‌ను యాడ్ చేసిన గ్రూపు నుంచి
తొలగించి బ్లాక్‌లిస్టులో పెట్టేశారు.
●శ్రీకాకుళం కేంద్రంగా టెలిగ్రామ్ యాప్‌లో
ఓ యువతి పైన చెప్పిన తరహాలోనే రూ.2.80
లక్షలు మోసపోయింది. ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
కావడం విశేషం.
●ఇచ్ఛాపురానికి చెందిన ఓ యువకుడు వర్క్‌ఫ్రం హోం అంటూ ఆన్‌లైన్ టాస్క్‌ల పేరిట రూ.12.50 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. ఆఖరికి
ఇంట్లో వాళ్లు అప్పు తీర్చాల్సి వచ్చింది.
టాస్క్ బేస్డ్ పార్ట్ టైమ్ జాబ్.. మోసగాళ్ల సరికొత్త వల. డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశ చూసి ఖాతాలు ఖాళీ చేసేందుకు వేసిన తాజా ప్రణాళిక. జిల్లాలోనూ ఈ తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తెలియని లింక్‌లు, పార్ట్‌టైం జాబ్ ఆఫర్స్ కొన్నిమార్లు వస్తుంటాయి. క్లిక్ చేశాక వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. మనకు తెలియకుండానే అవతలి వాళ్లు మనల్ని గ్రూపులో యాడ్‌చేస్తారు. కొన్ని టాస్క్‌లు (లైక్‌లు కొట్టడం, సబ్‌స్క్రైబ్ చేయడం) మీరు గెలుచుకుంటే సొమ్ము రెట్టింపు వస్తుందని నమ్మబలుకుతారు. మొదటి టాస్క్‌లో రూ. 1000 నుంచి రూ. 2 వేలు పెట్టుబడి పెడితే దానికి డబుల్ అమౌంట్ తర్వాత టాస్క్ రూ. 10 వేలు అని ఫినిష్ చేస్తే డబుల్ అంటారు.. సక్సెస్‌గా పూర్తి చేసినా మన ఖాతాలో డబ్బులు రావు. మన పేరుతో ఓ ఫేక్ యాప్ అకౌంట్‌ను వ్యాలెట్ రూపంలో చూపించి అందులో డబ్బులు యాడ్ అయినట్లు చూపిస్తారు. మనం విత్‌డ్రా చేయడానికి అవ్వదు. మళ్లీ మూడో టాస్క్ రూ. 50 వేలు అని పూర్తి చేస్తే రూ. 1 లక్ష వస్తుందని నమ్మిస్తారు. కంప్లీట్ అయ్యాక డబ్బులు విత్‌డ్రా చేద్దామంటే అవ్వకపోవడంతో వారిని మనం అడిగితే అందులో మొదట పంపిన రూ. 10 వేలకు రూ. 10 వేలు, తర్వాత పంపిన రూ. 50 వేలకు రూ. 50 వేలు చూపించి విత్‌డ్రా ఆప్షన్ డిజేబుల్ అని చూపిస్తుందంటారు. టాస్క్‌లో మీరేదో తప్పు చేయడం వలనే ఇలా జరిగిందని అది ఎనేబుల్ చేయడానికి నాలుగో టాస్క్ చేయాలంటారు. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ఆ టాస్క్ ఉంటుందంటారు. మనం నమ్మి ఆ డబ్బులు పంపిస్తే అక్కడికి కొద్ది క్షణాల్లోనే అకౌంట్ బ్లాక్ అయిపోయిందని మీ అకౌంట్‌లో రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలుందని అవి విత్‌డ్రా అవ్వాలంటే మరో రూ. 2లక్షలు, లేదా రూ. 3లక్షలు వేయాలని చెబుతారు. పైగా మనకు తెలియకుండానే వేరే బాధితుడి అకౌంట్‌కు సైతం రూ. 10 వేలు వేయించి మన చేతే ముందుగా ఫ్రాడ్ చేయించి ఉంటారు. డబ్బులు వేశాక గ్రూపు నుంచి రిమూవ్ చేసి నంబర్లు బ్లాక్ చేస్తారు.
కాంబోడియా, చైనాలో..
ఈ తరహా మోసాలకు పాల్పడేవాళ్లు కాంబోడియా, చైనాలోనే ఉంటారని సైబర్ నిపుణులంటున్నారు. ఇక్కడి మధ్య వర్తులు అమాయక ప్రజల చేత బ్యాంకు ఖాతాలు తెరిపించి, వారి పేరుతోనే ఫోన్ సిమ్‌లు కొనిపించి మోసపోయిన బాధితుల సొమ్మును వీరి ఖాతాలో పడేటట్లు చేసి తర్వాత అనేక ఖాతాలు మార్చి చివరికి వారికెళ్లేలా చేస్తారు. ఇదంతా ఓ లింక్ సిస్టమ్ మాదిరిగా జరు గుతుంది. ఇప్పటివరకు ఎన్నో సైబర్ కేసుల్లో మన జిల్లా పోలీసులు పక్క రాష్ట్రాల వరకు వెళ్లారు. బ్యాంకు ఖాతా చిరునామాలున్నవారికి, నడిపిన మధ్యవర్తులకు నోటీసులిచ్చారు. కొందరు ఇక్కడి కోర్టులకు సైతం వచ్చారు. కానీ మోసం చేసే కేటుగాళ్లు మాత్రం విదేశాల్లో దాక్కుని ఉన్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
తెలియని లింక్‌లు క్లిక్ చేయకూడదు. స్పామ్ కాల్స్, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయొద్దు. టాస్క్‌బేస్డ్ ఆఫర్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాలను అరిక ట్టేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యూహాత్మ కంగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటున్నాయి. జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వస్తుంది.
– కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం
ఫుల్ టైమ్ ఫ్రాడ్
ఫుల్ టైమ్ ఫ్రాడ్
Comments
Please login to add a commentAdd a comment