ఏటీఎం కార్డు మార్చేసి..
శ్రీకాకుళం క్రైమ్ : ఓ రిటైర్డ్ అధికారి వద్ద ఏటీఎం కార్డు మార్చేసి రూ. 1,63,900 కొట్టేసిన వైనం జిల్లా కేంద్రంలోని అరసవల్లి మిల్లు కూడలి సమీప ఎస్బీఐ ఏటీఎంలో చోటు చేసుకుంది. ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం. హరికృష్ణ, బాధితుడు తెలిపిన వివరా ల ప్రకారం.. అరసవల్లి మిల్లు జంక్షన్ సమీపంలో ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు ఓ రిటైర్డ్ అధికారి వెళ్లి రూ.9 వేలు విత్‌డ్రా చేశారు. కార్డును మిషన్ నుంచి తీయకుండానే పక్కనే ఆ డబ్బులు లెక్కపెడుతుండగా వెనుకగా నిల్చొన్న గుర్తు తెలియని వ్యక్తి గమనించాడు. క్షణాల్లో అధికారి కార్డు తీసేసి తన కార్డును మిషన్‌లో పెట్టేశాడు. సార్ మీ కార్డు మిషన్‌లో ఉంచేశారు.. తీయండి అంటూ సాయం చేసినట్లు నటించి అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడికి రెండు రోజుల తర్వాత ఎస్బీఐ యోనోయాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయగా రూ.1,63,900 ఎవరో ఏటీఎం కార్డు ద్వారా విత్‌డ్రా చేసినట్లు అధికారి గ్రహించారు. వెంటనే తన వద్దనున్న ఏటీఎం కార్డు తీసుకెళ్లి తనిఖీ చేయ గా బ్యాలెన్స్ తక్కువగా కనిపించడంతో వెంటనే సంబంధిత మెయిన్ బ్రాంచి (ఎస్బీఐ) అధికారులను కలవగా కార్డును బ్లాక్ చేసి స్టేట్‌మెంట్ తీసి చూపించి పోలీసులను ఆశ్రయించాలన్నారు.
పలుచోట్ల తీసి..
చివరికి ఒడిశాలో..
స్టేట్‌మెంట్‌లో మోసం చేసిన వ్యక్తి ముందుగా విశాఖపట్నం శ్రీ సంఘవి జ్యూయలర్ మాల్ ఏటీఎం వద్ద రూ.75 వేలు, అశీల్‌మెట్ట ఏటీఎం వద్ద రూ.10 వేలు, అదే చోట రెండుసార్లు రూ.10 వేలు, మరోసారి రూ.వెయ్యి తీశాడు. అక్కడి నుంచి ఒడిశా రాష్ట్రంలోకి వెళ్లి బరంపురం సిటీ హాస్పిటల్ రోడ్డులో రూ.10 వేలు, అదేచోట మూడుసార్లు రూ. 10 వేలు చొప్పున, చివరికి గజపతి జిల్లా సూర్యా హాల్‌మార్క్ వద్ద రూ.17,900 తీశాడు. ఈ ఘటనపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.