
పవన్ అనాలోచిత నిర్ణయాలతో రైతులకు తీవ్ర నష్టం
● ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
టెక్కలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనాలోచిత నిర్ణయాలతో ఈ రోజు బియ్యం ఎగుమతులు లేక రైతులు తీవ్రమైన నష్టాలకు గురవుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం టెక్కలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీజ్ ద షిప్ వ్యవహారంలో అక్రమాలను వెలికితీస్తామని చెప్పి ఎందుకు మౌనంగా ఉన్నారని దువ్వాడ ప్రశ్నించారు. గతంలో ఏపీ నుంచి విస్తారంగా సన్న రకాలు ఎగుమతులు జరిగాయని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ పాలనలో రూ.2900 ధర పలికిన సన్న రకాల ధర ఈ రోజు రూ.1700కు పడిపోయిందని అన్నారు. అవి కూడా కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. సన్న రకాలను ప్రోత్సహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనలతో ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల్లో విస్తారంగా సన్న రకాలు పండించారని, ఇప్పుడు ధరలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారని దువ్వాడ మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో విత్తు నుంచి విక్రయం వరకు. రైతుల సంక్షేమం కోసం అధికారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితులను ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం నుంచి సుమారు 31 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, ఇదే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గతంలో గోల చేశారని ఇప్పుడు అదృశ్యమైన మహిళల్ని ఎందుకు తీసుకురావడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రెండు బడ్జెట్‌లలో ఉత్తరాంధ్రకు వచ్చిన ప్రయోజనమేమిటని దువ్వాడ ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏడాది కాలంలో సుమారు 80 శాతం పనులు పూర్తి చేశారని ఇప్పుడు టీడీపీ నాయకులు పోర్టు కాంట్రాక్ట్‌ల కోసం కుమ్ములాడుకుంటున్నారు తప్ప పోర్టును పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బారువాను మరో గోవా చేస్తామంటూ ఇటీవల కేంద్ర మంత్రి చేసిన ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని శ్రీనివాస్ అన్నారు. లింగాలవలస గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రగల్బాలు పలకడం ఆపేసి ఎన్నికల మునుపు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.