
వేటకు వెళ్లేవారిపైనా.. నిషేధమేనా?
ఈ చిత్రంలో ఉన్న మత్స్యకారుడి పేరు వారాధి ఎర్రయ్య. రణస్థలం మండలం ఎర్రముక్కాం గ్రామం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సార్లు వేట నిషేధ భృతి అందుకున్నాడు. ఈ ఏడాది కూడా వేటనిషేద భృతి తొలి జాబితాలో పేరుంది. చివర్లో రాజకీయ కారణాలతో పేరు తప్పించేశారు. అర్హత ఉన్నా తన పేరును తప్పించేసి కూటమి నాయకులు తమకు నచ్చినవాళ్లకు ఇప్పించుకున్నారని వాపోతున్నాడు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 11 మండలాల్లో మత్స్యకార కుటుంబాలు సముద్రపు వేటతో జీవనాధారంగా సాగిస్తున్నారు. ఇందులో వేటనిషేధ కాలంలో అందాల్సిన భృతికి అనర్హులుగా మత్స్యశాఖాధికారులు మొత్తం 511 మంది అని స్పష్టం చేశారు. శ్రీకాకుళం రూరల్‌లో 31, గారలో 106, ఎచ్చెర్లలో 60, రణస్థలంలో 106, కవిటిలో 61, వజ్రపుకొత్తూరులో 35, పోలాకిలో 41, సోంపేటలో 32, సంతబొమ్మాళిలో 27, ఇచ్ఛాపురంలో 08, మందసలో నలుగురు చొప్పున మత్స్యకారులు అనర్హులుగా గుర్తించారు. వాస్తవానికి ఒక్క శ్రీకాకుళం రూరల్ మండలంలోనే వంద మందికి పైగా అర్హులకు కరెంట్ బిల్లు పెరుగుదల, ఇతర కారణాలు చెప్పి పథకాన్ని వర్తింపజేయలేదు. గార, సంతబొమ్మాళిలలో కూడా ఈ సంఖ్య రెట్టింపుగా ఉంది. దీని ప్రకారం జిల్లా వ్యాప్తంగా మరో 1200 మంది వరకు అర్హులకు ఈ పథకాన్ని వర్తింపజేయాల్సి ఉందనే మత్స్యకార సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
● వేట నిషేధ భృతి మంజూరులో
వెలుగుచూస్తున్న ‘కూటమి’ నేతల లీలలు
● పథకం వర్తించక ఆవేదనలో
సుమారు 1200 మంది మత్స్యకారులు
● సుమారు ఐదు వేల మందితో
‘సగం వాటా’ ఒప్పందం!
● గత ప్రభుత్వంలో పార్టీలకతీతంగా పథకం వర్తింపు
అరసవల్లి:
గడిచిన ఐదేళ్లలో కనిపించని, వినిపించని మత్స్యకార జీవన కష్టాలు, అవస్థలు కూటమి ప్రభుత్వంలో మళ్లీ మొదలయ్యాయి. సముద్రంలో వేట నిషేధ కాలంలోనే ఉపాధి కోల్పోయిన వేట మత్స్యకారులకు రాష్ట్ర సర్కార్ పొట్టకొట్టింది. ఇప్పటికే గతేడాది వేట నిషేధ కాలంలో రావాల్సిన భృతిని ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వివిధ రకాల ఆంక్షల కారణంగా అర్హులైన వేట మత్య్సకారులకు భృతి రాకుండా అడ్డుపడింది. ఇదే సమయంలో అనేక మంది అనర్హులకు పథకం వర్తింపజేసి వారికి మంజూరైన సొమ్మును కూటమి నాయకులు సగం.. సగం పంచుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 మండలాల్లో 15548 మంది మాత్రమే మత్స్యకార చేయూత పథకానికి అర్హులంటూ అధికారికంగా ప్రకటించి ఇటీవల ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున లబ్దిదారుల ఖాతాల్లో ఇటీవల జమ చేసింది. ఇదిలావుంటే అన్ని అర్హతలుండి.. కేవలం కూటమి సర్కార్ ఆంక్షలు, రాజకీయ కుట్రల ఫలితంగా పథక లబ్ధికి దూరమైన సుమారు 12 వందల మంది వరకు మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, వాస్తవ సర్వేను క్షేత్ర స్థాయిలో మళ్లీ చేపట్టాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
అనర్హులంటూ జాబితాలో తప్పించేసి..!
అనర్హుల విషయంలోనే లెక్కల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. మత్స్యశాఖ లెక్కలు ప్రకారం మొత్తం 511 మంది మాత్రమే ఈ పథకానికి అనర్హులుగా తేల్చారు. వీరంతా నిబంధనల ప్రకారం పథక లబ్ధికి అర్హులు కారని స్పష్టం చేశారు. వాస్తవానికి కూటమి అధికారిక జెండాలు పట్టుకున్న కార్యకర్తల చేతిలోనే చాలావరకు జాబితాలు గల్లంతయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చాలావరకు ఇవే కారణాలతో తుది జాబితాలో పేర్లను మార్చేశారని సమాచారం. దీంతో అనధికారికంగా ఈ అనర్హుల జాబితా 1200 మందికి పైగా ఉందనే లెక్కలున్నాయంటూ మత్స్యకార సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అయినప్పటికీ కూటమి సర్కార్ మాత్రం సంఘ ప్రతినిధులు, వాస్తవ లెక్కలను బేఖాతరు చేస్తూ..తాము ప్రకటించిన వారికే పథకాల లబ్ధి అంటూ వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇదిలావుంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారికి ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి జరగదని, ఇతర పథకాలకు అనర్హులంటూ కూటమి సర్కార్ మెలిక పెట్టడంపై ఇప్పటికే మత్య్సకారులు మండిపడుతున్నారు.
సీఎం వద్దకు వెళ్లకుండా ఆంక్షలు..
బుడగట్లపాలెంలో మత్స్యకారులకు భృతి అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చిన సందర్భంగా గత ఏడాది వేట నిషేధ భృతి అందని వారు, అలాగే తాజాగా భృతి అందాల్సిన జాబితాలో పేరులేని అర్హులు, బాధితులెవ్వరూ సీఎం సభకు వెళ్లకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పక్కాగా వ్యవహారం నడిపించారు. సీఎం వద్దకు ఎవ్వరి నినాదాల స్వరాలు వెళ్లకుండా, వినిపించకుండా అడ్డుకున్నారు. ఇతర సంక్షేమ పథకాలకు దూరమవుతారంటూ హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది.
వాటాల పంపకాల్లో పొరపచ్చాలు!
జిల్లాలో 11 మండలాల్లో ఇప్పటికి 15548 మంది అర్హులకు మాత్రమే మత్స్యకార చేయూత కార్యక్రమాన్ని అందించారు. ఒక్కొక్కరికి రూ.20 వేలు కాగా, అందులో నీకు రూ.10 వేలు..నాకు 10 వేలు అంటూ...వారికి అందుబాటులో ఉన్న వారి పేర్లను (మత్స్యకార కుటుంబాలకు చెందిన వారు) జాబితాలో చేర్చుకుని.. ముందస్తు ఒప్పందం ద్వారా బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ కాగానే సగం సగం సర్దుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఇలా సుమారు ఐదు వేల మంది వరకు ఉన్నారని సమాచారం. ఈ వాటాల పంపకాల్లో కూటమి నేతల్లో సైతం పొరపొచ్చాలు వచ్చేశాయని తెలుస్తోంది.

వేటకు వెళ్లేవారిపైనా.. నిషేధమేనా?