సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్, చిత్రంలో మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి
మునుగోడు: ‘పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే డిండి ప్రాజెక్టుకు, శివన్నగూడెంకు నీళ్లు వస్తాయి. ఆ ప్రాజెక్టు చివరి దశకు వచ్చింది. కరువు ప్రాంతం కాబట్టి మిగిలిన పనులన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఏడాదిన్నరలో మునుగోడు నియోజకవర్గంలోనే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత నాది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మునుగోడులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. ఫ్లోరైడ్‌తో ఒకప్పుడు నల్లగొండ జిల్లా ప్రజలు గోస పడ్డారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లోరైడ్‌ను తరిమికొట్టి నీళ్ల గోస తీర్చామని చెప్పారు. వేదికపై నుంచి సీఎం తొమ్మిది నిమిషాలు మాత్రమే మాట్లాడినా.. ఎక్కువగా సాగు, తాగునీటి అంశాలనే ప్రస్తావించారు.
ఈ ప్రాంతానికి సాగునీరు అందించే నక్కలగండి ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. ఈ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో నియోజకవర్గంలోని చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్లను పూర్తిచేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
సాకారం దిశగా సాగునీటి కల..
సీఎం కేసీఆర్ ప్రసంగం మునుగోడు ప్రజల్లో నూతన ఉత్సాహం నింపింది. సాగునీటి కల నెరవేరనుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది. గత ఏడాది ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో దాదపు 90 శాతం అమలు చేశామని, మిగిలిన పనులు త్వరలో చేస్తామని సీఎం చెప్పడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఈలలు వేశారు. అభివృద్ధి పనులపై కొత్త హామీలు ఇవ్వకపోయినా.. ప్రధానంగా సాగు నీటి అంశంపై సీఎం మాట్లాడడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
సభ విజయవంతం
మునుగోడులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా స్థలం జనంతో నిండిపోయింది. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఊహించిన దానికంటే అధికంగా జనం తరలివచ్చారు. సీఎం సభా వేదికపైకి ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆయన రాక కోసం వేచి ఉండి ప్రసంగం విన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలు మధ్యాహ్నం 2 గంటల నుంచే సభా స్థలానికి చేరుకున్నారు. మునుగోడు అంతా గులాబీ మయమైంది.
అలరించిన ఆటాపాటలు
సభలో కళాకారుడు మిట్టపల్లి సురేందర్ కళాబృందం పాడిన పాటలు అందరినీ అలరించాయి. కళాకారులు పాటలు పాడుతున్న సమయంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన భార్య అరుణ, మహిళా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్‌లు వేదికపై నృత్యాలు చేశారు.
సభలో మంత్రులు జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, యాదాద్రి జిల్లా జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, నాయకులు మునగాల నారాయణరావు, జెల్లా మార్కండేయులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సాగునీటి వనరులు పెంచి నేడు అన్నపూర్ణగా మార్చారనిఅన్నారు. అత్యధింగా ఫ్లోరోసిస్ ఉన్న మునుగోడులో ఆ సమస్యను తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించారన్నారు.
రానున్న రోజుల్లో చర్లగూడెం, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్లను పూర్తిచేస్తామన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
మునుగోడు అభివృద్ధికి నిరంతరం పనిచేస్తా
తుదిశ్వాస వరకు తాను మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఉద్యమకాలంలో ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ సమస్యను గుర్తించిన కేసీఆర్ దానిని రూపుమాపేందుకు మొట్ట మొదటిగా మిషన్ భగీరథ పథకాన్ని మునుగోడు నియోజకవర్గంలో ప్రారంభించారన్నారు.
నక్కలగండి నుంచి సాగు నీరు అందించేందుకు మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో చెర్లగూడెం, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. కానీ, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఓర్వలేక కోర్టులో కేసులు వేయడంతో ఆ పనులు పూర్తి కాలేదన్నారు. ఈ ఎన్నికల అనంతరం ఆ పనులు ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేయించి రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. పూటకో పార్టీ మారే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
ఇదీ చదవండి: ‘ TS Special: వలసలు ఆపి.. వరిని పెంచాం.. ఇది మా ఘనత..! ’
Comments
Please login to add a commentAdd a comment