జిల్లా ప్రజలకు ఎస్పీ హోలి శుభాకాంక్షలు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా ప్రజలు ఎస్పీ నర్సింహ ఓ ప్రకటనలో హోలి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాదాలకు దూరంగా ఉంటూ అందరూ కలిసిమెలసి పండుగ జరుపుకోవాలని కోరారు. సంప్రదాయ రంగులు ఉపయోగించడం మంచిదని, ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్100 కు ఫోన్ చేసి పోలీసు సేవలు వినియోగించుకోవాలని కోరారు. పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. మద్యం సేవించి, అతివేగంతో వాహనాలు నడపవద్దని, డీజేలు, బాణసంచా నిషేధమని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవం ముగించుకోవాలని కోరారు.
పారదర్శకతకే
సామాజిక తనిఖీ
తిరుమలగిరి: గ్రామాల్లో ఉపాధిహామీ పథకం పారదర్శకంగా అమలు చేసేందుకు సామాజిక తనిఖీ నిర్వహించి సమీక్షిస్తున్నట్లు జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష తెలిపారు. గురువారం తిరుమలగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 15వ విడత ప్రజా వేదికలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లకుండా నివారించి వారు నివసిస్తున్న గ్రామాల్లోనే పనులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అంబుడ్స్‌మెన్ లచ్చిరాంనాయక్, విజిలెన్స్ అధికారి ఆశరాణి, ఎస్‌ఆర్‌పీ పాండురంగ, ఎంపీడీఓ లాజరస్, ఏపీఓ లక్ష్మి పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో గురువారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. దానిలో భాగంగా సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కళ్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం , మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామును సుప్రభాత సేవతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రధానాలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
జిల్లా ప్రజలకు ఎస్పీ హోలి శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment