ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో 2024–25 రబీ సీజన్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. 2024–25 రబీ యాక్షన్ ప్లాన్ పై మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ లక్ష్యం చేరుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా అరికట్టాలని ఆదేశించారు. తూనికలు కొలతల శాఖ అధికారులు వేయింగ్ మిషన్స్, వేయింగ్ స్కేల్స్ అన్నీ తనిఖీ చేసి స్టాంపింగ్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి డి. రాజేశ్వర్, మేనేజర్ ప్రసాద్, డీఆర్‌డీఓ అప్పారావు, డీసీఓ పద్మ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, ఎల్డీఎం బాపూజీ, మార్కెటింగ్ అధికారి నాగేశ్వర శర్మ, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి సురేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment