నేడు బీఆర్‌ఎస్ జిల్లా సమావేశం
ఫ హాజరు కానున్న పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సూర్యాపేట టౌన్: వరంగల్‌లో ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్‌ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ బహిరంగ సభ విజయవంతానికై గురువారం సూర్యాపేటలో ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బహిరంగ సభ విజయవంతంతోపాటు జిల్లాలో సాగు, తాగునీటి సమస్యపై చర్చించనున్నట్టు జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య నేతలంతా విధిగా హాజరు కావాలని కోరారు.
గోదావరి జలాలు 1,429 క్యూసెక్కులకు పెంపు
అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను చివరి విడతగా జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలను బుధవారం 1,429 క్యూసెక్కులకు పెంచారు. ఈ నీళ్లు 69డీబీఎంకు 500, 71డీబీఎంకు 850 క్యూసెక్కులు, మిగిలిన నీటిని 70డీబీఎంకు వదులుతున్నట్లు నీటి పారుదలశాఖ డీఈఈ ఎం. సత్యనారాయణ తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
నెలాఖరులోగా వంద రోజులు పని పూర్తి చేయించాలి
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): ఈనెలాఖరులోగా వంద రోజులు పని పూర్తి చేయించాలని అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్‌లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కూలీలకు వేసవిలో తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. వడదెబ్బబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు నెమ్మికల్‌లో ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ హసీం, ఏపీఓ ఈశ్వర్, ఈసీ మెంబర్ అరుణ జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ అంజమ్మ ఉన్నారు.
ఎన్జీ కాలేజీలో యూత్ పార్లమెంట్ ఎంపిక
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కాలేజీలో వికసిత్ భారత్ చైర్మన్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన నోడల్ యూత్ పార్లమెంట్ జిల్లాస్థాయి ఎంపికలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.మద్దిలేటి, రిటైర్డ్ ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు జరిపించడం వల్ల జరిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరిచారు. నల్లగొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో వికసిత్ భారత్ తెలంగాణ కోఆర్డినేటర్ శివ, పర్యావరణ వేత్త సురేష్ గుప్త, దుశ్చర్ల సత్యనారాయణ, రిటైర్డ్ లెక్చరర్ విజయ్‌కుమార్, ఏచూరి శైలజ, నెహ్రూ యువకేంద్రం జిల్లా అధికారి బి.ప్రవీణ్ సింగ్, ఎన్జీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, సుధాకర్, ఎం.వెంకట్‌రెడ్డి, బి.అనిల్ కుమార్, ఎన్.కోటయ్య, ఏ.మల్లేశం, కె.శివరాణి, ఎం.సావిత్రి, శిరీష, అంకుశ్, వాసు, దినేష్, కొండానాయక్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : మహాత్మాజ్యోతిరావుపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9 తరగతుల్లోని ఖాళీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈబీసీ విద్యార్థులు చేరేందుకు నిర్వహించే ప్రవేశపరీక్షకు ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని బీసీ గురుకులాల ఆర్‌సీఓ ఇ.స్వప్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు అర్హత గల విద్యార్థులుwww.mjptbcwreis.telangana.go v.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 20న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment