
సాక్షి, చైన్నె: డీఎంకే మిత్రపక్షాలలో ప్రైవేటు సంస్థలలో పని వేళల పొడిగింపు వ్యవహారం చిచ్చు రేపింది. ప్రైవేటు సంస్థలలో 8 గంటలకు బదులుగా 12 గంటల పని వేళలు అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ నిర్ణయానికి అనుగుణంగా గత కొన్నేళ్ల పాటు మిత్ర పక్షాలైన కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే పార్టీలు అడుగులు వేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అసెంబ్లీ వేదికగా మిత్ర పక్షాలు తమ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న డీఎంకే ప్రభుత్వ నిర్ణయాన్ని శుక్రవారం తీవ్రంగా వ్యతిరేకించాయి.
మంత్రులు సీవీ గణేషన్, తంగం తెన్నరసు సభలో ఓ ముసాయిదా ప్రవేశపెట్టారు. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలలో ఇక 8 గంటలకు బదులుగా 12 గంటల పనివేళలు నిర్ణయిస్తున్నామని ఆ తీర్మానంలో వివరించారు. దీనిని సభలో ఉన్న కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే డీఎంకే మిత్రపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 8 గంటల పనివేళలను 12 గంటలుగా నిర్ణయించడం కార్మికులతో చెలాగాటం ఆడినట్టేనని, ఈ ప్రయత్నాన్ని వీడాలని డిమాండ్ చేశాయి. ఇందుకు మంత్రులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, ఆ పార్టీలు అంగీకరించ లేదు.
దీంతో సభలో ఆ తీర్మానాన్ని డీఎంకే మెజారిటీ సభ్యుల నిర్ణయంతో ఆమోదించారు. అయితే, డీఎంకే మిత్రపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సభలో నినదించడం గమనార్హం. అనంతరం వెలుపల మంత్రులు మీడియాకు ఈ చట్టం గురించి వివరించారు. ఇది బలవంతం కాదని, ఆయా సంస్థలు, అక్కడి సిబ్బంది నిర్ణయం మేరకు అమల్లో ఉంటుందని వివరించారు. పని వేళలను పొడిగించడం ద్వారా రాష్ట్రంలోకి పెట్టుబడుల వరద మరింతగా పెరగనున్నాయని, లక్షలాది మందికి ఉపాధి దక్కబోతోందని వివరించారు.
12 గంటల పని వేళ అనేది పరిశ్రమల యాజమాన్యం, కార్మికుల పరస్పరం అంగీకారం మేరకు అమలు అవుతుందని, ఇందులో బలవంతం లేదని స్పష్టం చేశారు. ఏదేని సంస్థ, పరిశ్రమల బలవంతంగా 12 గంటలు పనిచేయాలని ఒత్తిడి తెచ్చిన పక్షంలో ఆసంస్థలపై చర్యలు తీసుకునేలా ఈ చట్టంలో అంశాలను పొందుపరిచినట్టు వివరించారు. ఈ చట్టం ఎలక్ట్రానిక్ ఆధారిత, క్లస్టర్ ఎలక్ట్రానిక్స్, నాన్ లెదర్ పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని, ఇక్కడ కార్మికులు అధిక గంటలు పనిచేస్తున్నారని వివరించారు. ఈ చట్టం ఆధారంగా కార్మికులకు అదనపు పని వేళలకు తగ్గ ప్రయోజనాలు కూడా ఉంటాయని వివరించారు.