సాక్షి, చైన్నె: చిదంబరం నటరాజస్వామి వారి సన్నిధిలో ఆదివారం కనులపండువగా రథోత్సవం జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం శివనామ స్మరణను మార్మోగించారు. నటరాజ స్వామి ఓ రథంలో, శివగామసుందరి అమ్మవారు మరోరథంలో, సుబ్రమణ్యంస్వామి, వినాయకుడు, చండీశ్వర్ వేర్వేరు రథాల్లో ఆశీనులై దర్శనం ఇచ్చి భక్తులను కనువిందు చేశారు.
కడలూరు జిల్లా చిదంబరంలో వెలసిన నటరాజస్వామి ఆలయం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రతిఏటా ఆణి, మార్గళి మాసాలలో రెండు మార్లు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాదిలో తొలి బ్రహ్మోత్సవంగా ఆణి తిరుమంజనోత్సవాలు ఈనెల 17వ తేదీ నుంచి కనులపండువగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ఇప్పటి వరకు స్వామివారు ప్రతిరోజూ చంద్రప్రభ, సూర్యప్రభ, వెండి, వృషభ, గజ, బంగారు కై లాశ వాహనాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉత్సవాలలో 9వ రోజైన ఆదివారం రథోత్సవ వైభవం అత్యంత వేడుకగా జరిగింది.
రథోత్సవం..
ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత రథోత్సవానికి ఉంది. ఈ ఉత్సవం కోసం ఆదివారం వేకువజామునే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కనక సభ నుంచి మూలవిరాట్ నటరాజస్వామిని, శివగామసుందరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వెయ్యి కాళ్ల మండపం వద్దకు తీసుకొచ్చారు. పంచమూర్తులతో కలిసి స్వామి వారు బ్రహ్మాండ రథంపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే, మరో రథంపై అమ్మవారు భక్తులను కటాక్షించారు. స్వామి అమ్మవార్ల రథాలకు ముందుగా గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, చండీశ్వర్ స్వాములు వేర్వేరు రథాలలో ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఒకటి తర్వాత మరొకటి రథాలు ఆలయం నుంచి పురవీధుల వైపుగా కదిలాయి. శివనామ స్మరణలు మార్మోగగా, వేలాదిగా తరలివచ్చిన భక్త జనం రథంలో ఆశీనులైన స్వామి, అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు. ఒకే సమయంలో ఒక రథాన్ని మరొకటి అనుకరిస్తూ ముందుకు సాగడంతో రథోత్సవం కనులపండువగా జరిగింది. భక్తులు శివుడి, నటరాజస్వామి వేషాలలో రథాలకు ముందుగా శివనామస్మరణను మార్మోగిస్తూ అడుగులు వేశారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం సోమవారం జరగనుంది. వేకువజామున వెయ్యికాళ్ల మండపంలో నటరాజస్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. సాయంత్రం ఆణి తిరుమంజనోత్సవం జరగనుంది. రాష్ట్రం నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి రానుండడంతో చిదంబరంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
సుశీంద్రంలో..
కన్యాకుమారి జిల్లా సుశీంద్రంలో దనుమలయ ఆలయంలో నటరాజస్వామిగా పరమ శివుడు కొలువై ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి ఉత్సవాలలో భాగంగా ఆణి ఉత్తరం రోజైన ఆదివారం స్వామి వారికి 16 రకాల వస్తువులతో తిరుమంజనసేవ కనులపండువగా జరిగింది. ఉదయం అభిషేక మండపంలో వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామి వారికి చందనం, పాలు, పెరుగు, కొబ్బరినీరు, పన్నీరు, చెరకు రసం, పంచామృతం సహా 16 రకాల వస్తువులతో అభిషేకం జరిగింది. అనంతరం స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment