సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు ఎవరో అనే చర్చ పార్టీలో బయలుదేరింది. ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుత అధ్యక్షుడు కేఎస్ అళగిరిని తప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో పదవిని చేజిక్కించుకునేందుకు రేసులో ఐదుగురు నేతలు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అళగిరి ఐదేళ్ల పాటు కొనసాగారు.
కాంగ్రెస్‌లో మూడేళ్లకు ఒకసారి అధ్యక్ష మార్పు జరిగేది. అయితే, అళగిరి పనితీరును మెచ్చి ఆయన్ను అదనంగా మరో రెండేళ్లు కొనసాగించారు. డీఎంకేతో సఖ్యతగా ఉంటూ వచ్చిన అళగిరి ఒక లోక్‌సభ, ఒక అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక, నగర పాలక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. ఈ పరిస్థితులలో తమిళనాడుతో పాటు నాలుగు రాష్ట్రాలలో దీర్ఘకాలంగా అధ్యక్షుడిగా ఉన్న వారిని చార్చేందుకు అధిష్టానం నిర్ణయించడం గమనార్హం.
ఢిల్లీకి అళగిరి..
కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తులను ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఆ పదవిని దక్కించుకునేందుకు నలుగురు ఎంపీలు, ఒక మాజీ ఎంపీ ప్రయత్నాలు చేపట్టి ఉండడం గమనార్హం. ఇందులో ఎంపీలు చెల్లకుమార్, జ్యోతిమణి, తిరునావుక్కరసర్ ఉన్నట్టు తెలిసింది. అలాగే, మాజీ ఎంపీ విశ్వనాథన్ సైతం ప్రయత్నాల్లో ఉండడం గమనార్హం. తిరునావుక్కరసర్ గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. రాహుల్‌గాంధీ మద్దతు కలిగిన ఎంపీ జ్యోతిమణి సైతం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే, అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసినా డీఎంకేతో సన్నిహితంగా మెలిగే నేతై ఉండాలన్న సలహాను కాంగ్రెస్ సీనియర్లు అఽధిష్టానానికి సూచించే పనిలోపడ్డారు. అళగిరి హుటాహుటినా ఢిల్లీకి ఆది వారం సాయంత్రం బయలుదేరి వెళ్లడంతో ఆయనకు మరో అవకాశం దక్కేనా లేదా కొత్త వారికి పదవి కట్టబెట్టేనా అన్నది వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment