సాక్షి, చైన్నె: ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజలే మన బాసులు, వారికోసం నిరంతరం అంకిత భావం, బాధ్యతతో పని చేయాలి’’ అని సివిల్ సర్వీసు ఉత్తీర్ణులకు సీఎం స్టాలిన్ సూచించారు. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 33 మంది అభ్యర్థులను గురువారం ఆయన అభినందించారు. అనంతరం ఘనంగా సత్కరించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వివరాలు.. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్(యూపీఎస్సీ) పరీక్షలలో రాణించాలన్న తపనతో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ప్రత్యేక శిక్షణకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులలో 33 మంది 2022 సంవత్సరం సివిల్ సర్వీసు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. మంచి ర్యాంకులతో వివిధ పోస్టులను చేజిక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. వీరందరినీ గురువారం సచివాలయంలో సీఎం స్టాలిన్ కలిశారు. వారిని అభినందించి, సత్కరించడంతోపాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ, తమిళనాడు గర్వపడే విధంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉన్నారని అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న లక్షలాది మందిలో విజయాన్ని దక్కించుకున్న అభ్యర్థుల్లో అనేక మంది గ్రామీణులు, మధ్య తరగతి కుటుంబాల వారు కావడం మరింత ఆనందం కలిగిస్తోందన్నారు.
తల్లిదండ్రులను మరవొద్దు..
పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేయడంలో తల్లిదండ్రుల శ్రమ ఎంతో ఉందని, ఈ స్థాయికి మిమ్మల్ని తీసుకు రావడంతో తల్లిదండ్రుల పాత్ర మరవలేనిదిగా పేర్కొన్నారు. ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు, బాధ్యత గల పోస్టుల్లో చేరినాంతరం తల్లిదండ్రులను మరవొద్దని, గ్రామీణ ప్రజల జీవితాలలో వెలుగు నింపే విధంగా శ్రమించాలని పిలుపు నిచ్చారు. ప్రజలే బాసులు అని, వారికి అంకిత భావం, బాధ్యతతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను దరి చేర్చాలని సూచించారు. గొప్ప అధికారులుగా బాధ్యతలు స్వీకరించినానంతరం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే విధంగా పయనం ఉండాలన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సెప్టెంబరు 15న అమలు కాబోతున్న కలైంజ్ఞర్ మహిళ హక్కు పథకం (రూ.1000 నగదు పంపిణీ) మీదే ఉందన్నారు. ఎందుకంటే ఇది మహిళలకు ఆర్థిక బలానికి ఉపయోగకరంగా ఉండబోయే పథకం అవని వివరించారు. ఈ పథకం అమలు పూర్తి బాధ్యతలు జిల్లాల కలెక్టర్ల భుజాన వేశానని గుర్తు చేస్తూ, అప్పగించిన పనిని ప్రజలి జిల్లాలో సక్రమంగా నిర్వర్తిస్తారనే నమ్మకం ఉందన్నారు. పేద ప్రజల అవసరాలను తీర్చడం, పేద ప్రజల పట్ల దయ చూపించడం ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ సేవ చేయడాన్ని ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా అలవాటు చేసుకోవాలని సూచించారు. శిక్షణలో చక్కగా రాణించాలని, త్వరలో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.
ప్రారంభోత్సవాలు..
అనంతరం సచివాలయం నుంచి పలు కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. రూ.13.07 కోట్లతో నిర్మించిన రెండు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, రూ. 3.42 కోట్లతోపునరుద్ధరించిన 7 హాస్టళ్లు ఇందులో ఉన్నాయి. అలాగే కార్మిక సంక్షేమం, స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం నేతృత్వంలో సిద్ధం చేసిన 45 ప్రభుత్వ వృత్తి శిక్షణ, విద్యా కేంద్రాలను, రూ. 1,559 కోట్ల 25 లక్షల వ్యయంతో 4. ఓ ప్రాజెక్టు మేరకు పరిశ్రమలను సీఎం ప్రారంభించారు. ఈ వృత్తి శిక్షణ కేంద్రాల్లో అదనంగా 5,140 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment