తమిళసినిమా: ప్రముఖ కరాటే మాస్టర్, నటుడు కరాటే హుస్సేన్ (60) ఆదివారం అర్ధరాత్రి చైన్నెలో కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న కరాటే హుస్సేన్ ఆస్పత్రిలో తీవ్ర వైద్య చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. ఈయన అసలు పేరు షిహాన్ హుసైనీ. మదురైకి చెందిన ఈయన ధనుర్విద్య, కరాటే విద్యల్లో మాస్టర్. ఈయన్ని దర్శకుడు కె.బాలచందర్ నటుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన దర్శకత్వం వహించిన పున్నగై చిత్రంలో కరాటే హుస్సేన్ తొలి సారిగా నటించారు. ఆ తరువాత రజనీకాంత్, విజయ్ కాంత్, శరత్ కుమార్ వంటి పలువురు నటులతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. అదేవిధంగా నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన బద్రి చిత్రానికి కరాటే శిక్షకుడిగా పని చేశారు. చైన్నెలో ధనుర్విద్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పలువురికి శిక్షణ ఇచ్చారు. కాగా కరాటే హుస్సేన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసి తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేశారు. అయినప్పటికీ కరాటే హుస్సేన్ ఆ వ్యాధి నుంచి బయట పడలేకపోయారు. ఈయన తన అవయవాలను మరణించిన మూడు రోజుల తర్వాత రామచంద్రా మెడికల్ కళాశాలకు దానం చేశారు. కాగా కరాటే హుస్సేన్ భౌతిక కాయాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల దర్శనార్థం స్థానిక బెసెంట్ నగర్‌లోని ధనుర్విద్య శిక్షణ కేంద్రం వద్ద ఉంచి, అనంతరం ఆయన సొంత ఊరు మదురైకు తీసుకెళ్లారు.