
మద్దతుదారులతో సెంగోట్టయన్ మంతనాలు
● మళ్లీ ఢిల్లీ పయన కసరత్తు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్ సోమవారం మద్దతుదారులతో తీవ్ర మంతనాలలో మునిగారు. ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లేందుకు కసరత్తులలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళణి స్వామికి వ్యతిరేకంగా సీనియర్ నేత సె ంగోట్టయన్ గళం విప్పడం ఆ పార్టీలో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆయన్ను మరికొందరు సీనియర్ నేతలు బుజ్జగించారు. సమస్య సమసినట్టే అనుకున్న సమయంలో సెంగోట్టయన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం చర్చకు దారి తీసింది. శనివారం కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశం కావడంతో అన్నాడీఎంకేలో కొత్త ప్రచారాలు ఊపందుకున్నాయి. ఢిల్లీ నుంచి ఆదివారం ఉదయం ఈరోడ్‌కు చేరుకున్న సెంగోట్టయన్ అక్కడి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పరిస్థితులలో సోమవారం సెంగోట్టయన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్దతుదారులతో మంతనాలలో మునిగారు. కుల్లం పాళయంలోని తన ఫామ్‌హౌస్ నివాసంలో ఆయన మద్దతుదారులతో సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ నుంచి మళ్లీ పిలుపు రావడంతోనే సెంగోట్టయన్ మద్దతు దారులతో మంతనాలు జరిపినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకేలో సెంగోట్టయన్‌ను కీలక స్థానంలో కూర్చొబెట్టే దిశగా ఢిల్లీ బిజేపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన కసరత్తులలో భాగంగానే ఈ మంతనాలు సాగుతున్నట్టు సమాచారం. బుధవారం సెంగోట్టయన్ మళ్లీ ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా ఈ తాజా కసరత్తులు మరో చర్చకు కూడా తెర మీదకు వస్తున్నాయి. సెంగోట్టయ్యన్‌ను బీజేపీ లోకి ఆహ్వానించి రాష్ట్ర పార్టీలో కీలక పదవి అప్పగించబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది.