సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ ఆదివారం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు ఏకంగా దాదాపు 1.47 లక్షల మంది గైర్హాజరయ్యారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3,09,323 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని... కానీ వారిలోనూ 2,33,248 మంది అభ్యర్థులే (61.37 శాతం మందే) హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ ప్రాథమికంగా వెల్లడించింది.
గతేడాది నిర్వహించి పేపర్ లీకేజీ వల్ల రద్దు చేసిన ప్రిలిమ్స్‌కు 2.86 లక్షల మంది (79.15శాతం) హాజరవగా ఈసారి వారి సంఖ్య అనూహ్యంగా తగ్గింది. రాష్ట్రస్థాయిలో ఉన్నత ఉద్యోగానికి పొందేందుకు మళ్లీ అవకాశం వచ్చినా దాన్ని వేలాది మంది సది్వనియోగం చేసుకోలేకపోవడం గమనార్హం.
కరెంట్ అఫైర్స్, ఎకానమీ నుంచి లోతైన ప్రశ్నలు..
ప్రశ్నపత్రం కాస్త కఠినంగానే ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో ఇచ్చిన ప్రశ్నపత్రంతో పోలిస్తే కాస్త సులభంగా ఉన్నప్పటికీ మెజారిటీ ప్రశ్నలు కఠినంగా వచ్చాయని చెప్పారు. యూపీఎస్సీ ప్రమాణాలకు మించి ప్రశ్నలను ఇచ్చినట్లు మరికొందరు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కరెంట్ ఆఫైర్స్, ఎకానమికీ సంబంధించి అడిగిన ప్రశ్నలు చాలా లోతుగా ఉన్నాయన్నారు.
అభ్యర్థులు సాధారణంగా రెండున్నర గంటల్లో 150 ప్రశ్నలకు జవాబిచ్చేలా... సగటున ఒక్కో ప్రశ్నకు ఒక్కో నిమిషం చొప్పున సమయం కేటాయించేలా ప్రశ్నలు ఉండాల్సి ఉండగా ఈసారి ప్రశ్నపత్రంలో ఒక్కో ప్రశ్నను చదివి అవగాహన చేసుకునేందుకే కనీసం రెండు నిమిషాలు పట్టిందని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో ప్రశ్నలు చదివి జవాబులు ఇవ్వడం కష్టమైందని పలువురు అభ్యర్థులు అభిప్రాపడ్డారు.
చాలా ప్రశ్నలకు మల్టి పుల్ జవాబులు ఉండటం అయోమయానికి గురిచేసిందని చెప్పారు. ఈసారి కటాఫ్ 70 నుంచి 75 మార్కుల మధ్యలో ఉండొచ్చని ప్రముఖ నిపుణురాలు బాలలత సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన వీడియోలో అభిప్రాయపడ్డారు. అయితే జోన్లవారీగా, కేటగిరీల వారీగా ఎంపిక ప్రక్రియ ఉండటంతో కటాఫ్ తగ్గుతుందన్నారు. కమిషన్ విడుదల చేసే ప్రాథమిక కీ అనంతరం కటాఫ్‌పై అంచనాలు వేసుకోవచ్చని, ప్రస్తుతానికి 75 మార్కులకు పైబడి వచ్చిన వారు మెయిన్ పరీక్షలకు సిద్ధం కావచ్చని చెప్పారు.
ముందే బయటకు వచ్చిన అభ్యర్థిపై ఎఫ్‌ఐఆర్
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి ఓఎంఆర్ షీట్‌లో తన హాల్‌టికెట్ నంబర్‌ను తప్పుగా బబ్లింగ్ చేసినందుకు హాలు నుంచి సమయం కంటే ముందే బయటకు వచ్చేశాడు. దీంతో అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రాలు తక్కువగా రాగా వాటిని అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేసేందుకు 14 నిమిషాల సమయం ఆలస్యమైంది. ఆ మేరకు ఆయా అభ్యర్థులకు సమయాన్ని సర్దుబాటు చేశారు. కాగా, రంగారెడ్డి జిల్లాలోని ఓ కేంద్రంలో అరగంటకన్నా ముందే పేపర్లు తీసుకున్నారంటూ కొందరు అభ్యర్థులు చేసిన ఆరోపణ నిజం కాదని జిల్లా కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment