సాక్షి,యాదాద్రి : బీఆర్‌ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు పార్టీకి రాజీనామా చేయడం చర్చ నీయాంశమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన మందుల సామేల్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచారు. ఉద్యమంలో కేసీఆర్ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తన సొంత నియోజకవర్గమైన తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు.
అయితే, 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న మందుల సామేల్‌కు టీఆర్‌ఎస్ నుంచి అవకాశం దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా టీడీపీతో టీఆర్‌ఎస్‌పొత్తు పెట్టుకుంది. తుంగతుర్తి సీటును టీడీపీకి కేటాయించడంతో మాజీ మంత్రి మోత్కుపల్లికి టికెట్ రాగా ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత 2104లో తుంగతుర్తి టికెట్‌ను తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుని కోటాలో నల్లగొండకు చెందిన గాదరి కిషోర్‌కుమార్‌కు కేటాయించారు.
దీంతో సామేలు ఆశలు గల్లంతయ్యాయి. అప్పుడు ఎన్నికల ప్రచార సభ కోసం తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమకారుడైన సామేలుకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని ప్రకటించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవి ఇచ్చారు. పదవీ కాలం పూర్తి అయిన తర్వాత కూడా మరో ఏడాది పొడిగించారు. అయితే, 2018 ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ మళ్లీ కిషోర్‌కే వచ్చింది. దీంతో మందుల సామేలు ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. పలు మార్లు సీఎం కేసీఆర్‌ను కలిసి తనకు తుంగతుర్తి టికెట్‌కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక టికెట్ రాదని భావించి..
వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కిషోర్‌ను ముచ్చటగా మూడోసారి తుంగతుర్తి ప్రజలు గెలిపించాలని గురువారం తిరుమలగిరిలో జరిగిన సభలో కేటీఆర్ ప్రజలను కోరారు. తాను కోరుకుంటున్న ఎమ్మెల్యే టికెట్ వచ్చే ఎన్నికల్లో కూడా రాదని తేలిపోవడంతో సామేల్ రాజీనామా చేశా రు. నియోజకవర్గంలో మెజార్టీ సామాజిక వర్గానికి చెందిన తనకు తీరని అన్యాయం జరిగిందని, ఎమ్మెల్యే కిషోర్ ఇసుక వ్యాపారంపై పలుమార్లు కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని సామేలు శుక్రవారం అర్వపల్లిలో చెప్పారు. అభిమానులు, కార్యకర్తలతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని, వచ్చే ఎన్నికలో తుంగతుర్తిలో పోటీ చేస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment