వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు మెరుగైన వైద్యం, వసతులను కల్పించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సిబ్బంది చేతివాటంతో ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుందని పలువురు అంటున్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శానిటేషన్ వస్తువులైన డస్ట్‌బిన్, చీపుర్లు, ఇతర సామగ్రిని ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఎత్తుకెళ్లారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ప్రభుత్వ ఆస్పత్రిలోని పేషెంట్‌కేర్ విభాగంలో పని చేసే ఓ మహిళ ఆస్పత్రి నుంచి డస్ట్‌బిన్ బకెట్, చీపుర్లను పట్టుకుని బయటకు రాగా అదే ఆస్పత్రిలో పని చేసే ఓ సెక్యూరిటీగార్డ్ తన ద్విచక్రవాహనంపై వచ్చి సదరు మహిళను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అయితే ఇదే ఘటనపై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును వివరణ కోరగా చోరీ జరిగిన విషయం ఆదివారం ఉదయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారం అందించామని తెలిపారు. ఇదిలా ఉండగా వస్తువులను ఆస్పత్రి నుంచి తీసుకెళ్లిన విషయంలో పేషెంట్‌కేర్‌లో పని చేసే మహిళ, సెక్యూరిటీగార్డుపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment