సాక్షి, హైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్/ముషీరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం మొదలైన ఐటీ సోదాలు గురువారం రెండోరోజూ కొనసాగాయి. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 36లో ఉన్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటితోపాటు కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో ఉన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి. తనిఖీల్లో వారి కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలు, లాకర్లు, బ్యాలెన్స్ షీట్లను అధికారులు సేకరించారు. ఒక్కో కంపెనీకి చెందిన ఐదేళ్ల ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలించారు.
ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి...
పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి కలసి చేసిన రియల్ ఎస్టేట్, మైనింగ్ సహా ఇతర వ్యాపారాలపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో హిల్‌ల్యాండ్, మైన్స్‌ల్యాండ్, తీర్థ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, శ్రీలార్వెన్ సిండికేట్ సంస్థల్లో ఈ ముగ్గురికీ చెందిన కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఉండటంతో ఇందుకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు.
హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు రూపంలో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించి తెరవగా కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలు బయటపడ్డట్లు తెలిసింది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బ్యాంకు లాకర్స్‌ను సైతం అధికారులు తెరిపించారు. పన్నుల ఎగవేతపై ఆరా తీశారు.
సోదాలయ్యాక వారి సంగతి చూస్తా: ఎమ్మెల్యే మర్రి
ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నినాదాలు చేయగా తన ఇంటి నుంచి బయటకు వచ్ఛి న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఐటీ అధికారులు వారి పని చేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మరోవైపు తమ సిబ్బందిని ఐటీ అధికారులు బెదిరించారని... కొందరిపై చేయి చేసుకున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.
అధికారులకు చేయి చేసుకొనే హక్కు లేదని... అలా జరిగితే తాము కూడా తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు. సోదాలు ముగిశాక వారి సంగతి చూస్తామన్నారు. కాగా, ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేత కొండపల్లి మాధవ్ నివాసంపై బుధవారం ఉదయం 5 గంటలకు మొదలైన ఐటీ దాడులు రాత్రి 12 గంటలకు ముగిశాయి. తన ఇంటిపై ఐటీ దాడులు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని మాధవ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment