దేవుని గుట్ట ఆలయం
సాక్షి, హైదరాబాద్: దేవునిగుట్ట ఆలయం.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఆంగ్‌కోర్‌వాట్ (ఆంకోర్‌వాట్) కంటే ముందు ఆ తరహా నిర్మాణ శైలితో రూపుదిద్దుకున్న దేవాలయం. ఇసుక రాతి బిల్లలపై ముందుగానే దేవతామూర్తుల భాగాలను చెక్కి పూర్తిరూపం వచ్చేలా క్రమపద్ధతిలో పేర్చిన గొప్ప నిర్మాణం. ఈ తరహా నిర్మాణం దేశంలో ఇదొక్కటే అనే అభిప్రాయం ఉంది. దాదాపు 1,500 ఏళ్ల క్రితం నిర్మితమైనట్లు భావిస్తున్న ఈ ఆలయం ఎప్పు డు కూలుతుందో తెలియని పరిస్థితి.
ఇంతకాలం తర్వాత దీని పునరుద్ధరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని పూర్తిగా విప్పదీసి తిరిగి నిర్మించబోతున్నారు. త్వరలో టెండర్లు పిలిచి ఏడాదిలో పునర్నిర్మాణాన్ని పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య చొరవతో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో, తెలంగాణ వారసత్వ శాఖ పర్యవేక్షణలో పనులు జరగనున్నాయి. జిల్లా కేంద్రం నుంచి 20 కి.మీ. దూరంలోని కొత్తూరు గ్రామ శివారులోని దట్టమైన అడవిలో దేవునిగుట్టపై ఈ ఆలయం ఉంది. ఆరో శతాబ్దంలో వాకాట రాజు హరిసేన హయాంలో మందిరాన్ని నిర్మించి ఉంటారని అంచనా.
పద్మపాణిగా భావిస్తున్న శిల్పం
ఏం చేస్తారు?
దేవునిగుట్ట ఆలయం దాదాపు 24 అడుగుల ఎత్తుంది. దేవతామూర్తుల ఆకృతులను ఒకే రాయిపై కాకుండా, చిన్నచిన్న రాళ్లపై చెక్కి, వాటిని క్రమపద్ధతిలో పేర్చటం ద్వారా మూర్తు లకు పూర్తి రూపమిచ్చారు. ముందుగా ఈ రాళ్లపై నంబర్లు రాసి విప్పదీస్తారు. నిర్మాణాన్ని పూర్తిగా విప్పిన తర్వాత పునాదిని పరిశీలిస్తారు. ఇప్పటివరకు ఉన్న ఆలోచన ప్రకారం.. డంగు సున్నంతో పునాదిని నిర్మిస్తారు. దానిమీద, నంబర్ల ప్రకారం రాళ్లను పేర్చి పాత రూపమిస్తారు.
రాయిరాయికి మధ్య డంగుసున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతిపొడి తదితర మిశ్రమంతో బైండింగ్ పొర ఏర్పాటు చేస్తారు. ఇలా పిరమిడ్ తరహాలో పైకి పేర్చుకుంటూ వెళ్తారు. పైభాగంలో ప్రస్తుతం పెద్ద రంధ్రం ఉంది. అం దులోంచి వాననీరు లోనికి చేరుతోంది. కొత్త నిర్మాణంలో ఇలాంటి లోపాలను సరిదిద్దుతా రు. రాళ్లు మళ్లీ కదిలిపోకుండా స్టెయిన్‌లెస్ స్టీల్ పట్టీలను బిగించే యోచనలో ఉన్నారు.
రూ.2 కోట్లతోనే పనులు..
ములుగు జిల్లా కలెక్టర్ అందజేసిన రూ.1.8 కోట్ల నిధులకు కాస్త జోడించి రూ.2 కోట్లలోనే పనులు పూర్తయ్యేలా చూడాలని భావిస్తున్నారు. ఈ మేరకే టెండర్లు పిలువబోతున్నారు. కాకతీయ నిర్మాణాల పునరుద్ధరణ పనుల్లో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకే అవకాశం ఇవ్వనున్నారు. 6 నెలల నుంచి ఏడాదిలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్రేన్ లేకుండా..
ఈ ఆలయం గుట్టపైన ఉంది. రోడ్డు మార్గం లేకపోవడంతో క్రేన్‌ను పైభాగానికి తరలించే వీలు లేదు. క్రేన్ లేకుండా గొలుసులు ఏర్పాటు చేసి వాటితో రాళ్లను ఎత్తే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆలయానికి వినియోగించిన రాళ్లు కదిలాయే తప్ప, విరగలేదని గుర్తించారు. ఇటీవల డాక్యుమెంటేషన్ చేసే క్రమంలో త్రీడీ పరిజ్ఞానాన్ని వినియోగించి లేజర్ చిత్రాలు తీసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడెక్కడ పగుళ్లున్నాయి.. బేస్‌మెట్ ఎలా ఉంది.. తదితర వివరాలు గుర్తించారు. ప్రత్యేకంగా కొత్తగా రాళ్లను చెక్కాల్సిన అవసరం లేదని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment