మన అంకోర్‌వాట్‌ కూలుతోంది.. | Temple Of Devunigutta Built In Angkor Wat Style Is In Ruins At Telangana | Sakshi
Sakshi News home page

మన అంకోర్‌వాట్‌ కూలుతోంది..

Published Mon, Dec 16 2019 1:35 AM | Last Updated on Mon, Dec 16 2019 9:13 AM

Temple Of Devunigutta Built In Angkor Wat Style Is In Ruins At Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంకోర్‌వాట్‌ (ఆంగ్‌కోర్‌వాట్‌)... ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న కంబోడియాలోని అద్భుత హిందూ దేవాలయం. 12వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని గతేడాది దాదాపు 26 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ కట్టడాన్ని పునరుద్ధరించటంలో కీలక పాత్ర భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ) దే. మన సాయంతోనే దాన్ని పునరుద్ధరించి ప్రపంచపటంలో ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలిపారు. అయితే మన దేశంలో అంకోర్‌వాట్‌ తరహా శైలిలో నిర్మించిన మందిరం ఒక్కటే ఉంది. ఇది చిన్న నిర్మాణమే అయినా, నిర్మాణశైలి అంకోర్‌వాట్‌దే. ఆ ఒక్క నిర్మాణం మన తెలంగాణలోనే ఉంది. విశేషమేంటంటే.. అంకోర్‌వాట్‌కు ఈ చిన్న నిర్మాణమే స్ఫూర్తి అన్నది చరిత్రకారుల మాట. ఎందుకంటే అంకోర్‌వాట్‌ కంటే దాదాపు 550 ఏళ్ల క్రితమే దీన్ని నిర్మించారని చెబుతారు. ఆ తరహా నమూనాలో నిర్మించిన దేశంలోనే ఏకైక ఈ చిన్న గుడిని పరిరక్షించటం ఇప్పుడు అదే ఏఎస్‌ఐకి సాధ్యం కావటం లేదు. ఎందుకంటే స్థానిక యంత్రాంగం ఎన్‌ఓసీ ఇవ్వకపోవటమే. కళ్ల ముందే ఆ అద్భుత నిర్మాణం కూలిపోతున్నా.. యంత్రాంగం దాని పరిరక్షణకు ముందుకు రావటం లేదు. స్వచ్ఛందంగా అడుగు ముందుకేసి పూర్తిస్థాయిలో పూర్వ రూపు కల్పిస్తామన్న ఏఎస్‌ఐకి సహకరించటం లేదు. 

ఆరో శతాబ్దంలో నిర్మాణం! 
ములుగు జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో కొత్తూరు గ్రామ శివారులోని దట్టమైన అడవిలో దేవునిగుట్టపై కొలువుదీరింది ఈ ఆలయం. మూడేళ్ల క్రితమే దేవునిగుట్ట ఆలయం బయటి ప్రపంచానికి తెలిసింది. అప్పటివరకు స్థానికులే అక్కడ ఉత్సవాలు నిర్వహించుకునేవారు. దాన్ని ఎవరు నిర్మిం చారో ఇదమిత్థంగా ధ్రువీకరించేందుకు అక్కడ శాసనాలు లభించలేదు. దాని శైలి ఆధారంగా వాకాటకుల హయాంలో నిర్మితమైనట్టు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఆరో శతాబ్దంలో వాకాట రాజు హరిసేన హయాంలో నిర్మించి ఉంటారని అంచనా. అప్పట్లో మహాయానబుద్ధిజం ప్రభావం ఎక్కువ. ఆలయం దక్షిణం వైపు అజంతాలో ఉండే బోధిసత్వ పద్మపాణి తరహాలో భారీ శిల్పం ఉంటుంది. కానీ అది మహాశివుడి రూపమైన దక్షిణామూర్తి విగ్రహమని, హరిసేన హయాంలోనే హిందూయిజం విస్తరించటం బాగా ఉండేదని కొందరి వాద న. ఆలయంలో ఎలాంటి విగ్రహాలు లేవు.
 
ఇసుక రాళ్లే ఇటుకలుగా.... 
చాలా తేలికగా ఉండే ఇసుక రాళ్లను పేర్చి దేవునిగుట్ట గుడిగా మలిచారు. ఆ రాళ్లపై మానవ, జంతు ఆకృతులను తీర్చిదిద్దారు. ఆ ఆకారాలను వరసగా పేరిస్తే పూర్తి రూపమొస్తుంది. అంటే.. ముందుగానే రాళ్లపై శిల్పంలోని భాగాలు చెక్కి పేర్చి పూర్తి ఆకృతినిచ్చారు. ఇది కంబోడియాలో ఉండే నిర్మాణాలశైలి. ఒక గర్భగుడి మాత్రమే నిర్మించారు. ముందు ఎలాంటి మండపాలు లేవు. గర్భాలయం లోపల నిలబడి చూస్తే శిఖరం చివర వరకు కనిపిస్తుంది. ఆలయం వెలుపల, లోపల రాళ్లపై చిత్రా లు కనిపిస్తాయి. దట్టమైన అడవిలో ఉండటం, బయటి ప్రపంచానికి తెలియకపోవటంతో ఇంతకాలం దాన్ని పట్టించుకోలేదు. ఫలి తంగా రాళ్లు కదిలిపోయి ఆలయం కూలేదశకు చేరింది. దీన్ని గుర్తించిన తర్వాత మూడేళ్ల క్రితం ఏఎస్‌ఐ అధికారులు పరిశీలించారు. అది హెరిటేజ్‌ తెలంగాణ రక్షిత కట్టడం జాబితాలో లేకపోవటంతో పరిరక్షణకు సిద్ధమయ్యారు. వెంటనే స్థానిక గ్రామపంచాయతీ ప్రతినిధులను కలిసి లిఖితపూర్వకంగా విన్నవించారు.

దీనికి స్పందించిన నాటి గ్రామ పంచాయతీ ఎన్‌ఓసీ ఇచ్చింది. వెంటనే నాటి భూపాలపల్లి (ప్రస్తుత ములుగు జిల్లా) కలెక్టర్‌కు ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసింది. అప్పట్నుంచి అది పెండింగులోనే ఉంది. తరచూ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని వాకబు చేస్తున్నా ఫలితముండటం లేదు. ఇటీవలి భారీ వర్షాలకు ఆలయం రాళ్లు బాగా కదిలిపోయాయి. వచ్చే వానాకాలం నాటికి మొత్తం నేలమట్టమయ్యే ప్రమాదం నెలకొంది. ఇక్కడికి తరచూ విదేశీ నిపుణులు అధ్యయనంలో భాగంగా వచ్చి అబ్బురపడుతున్నారు. అంకోర్‌వాట్‌ తరహాలోనే నిర్మాణం ఉందని తేల్చి చెబుతున్నారు. కానీ దాన్ని పరిరక్షించాలన్న ఆలోచన మాత్రం మన యంత్రాంగానికి రావటం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement