
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఏటీఎంలు ఒక్కొక్కటిగా షట్‌డౌన్ అవుతున్నాయి. ప్రజలు బ్యాంకింగ్ లావాదేవీల కోసం డిజిటల్ వైపు మళ్లుతుండటంతో వీటి అవసరం క్రమంగా తగ్గుతోంది. మరోవైపు కరోనా భయం వెంటాడుతుండటంతో ఆదరణ కూడా తగ్గింది. ఒకవైపు ఆన్‌లైన్ పేమెంట్లు, మరోవైపు కరోనా ప్రభావంతో ఏటీఎంల్లో నగదు ఉపసంహరణ తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏటీఎంలను తగ్గించుకోవడంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. క్రమంగా కస్టమర్లు డిజిటల్ మాధ్యమాల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలకు అలవాటు పడటంతో వీటి అవసరం చాలా వరకు తగ్గుతోంది. దీంతో దినసరి 200 స్వైపింగ్ లేని ప్రాంతాలను గుర్తించి ఏటీఎంలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. నగరంలో వివిధ బ్యాంకులకు సంబంధించి సుమారు 4 వేల ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 20 శాతానికి పైగా ఏటీఎంలను మూసివేసినట్టు సమాచారం.
నగదు రహిత లావాదేవీలు...
ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ భయంతో నగదు రహిత లావాదేవీలు ఊపందుకున్నాయి. పాలు బిల్లు నుంచి ఇంటి అద్దె వరకు డిజిటల్ రూపంలో చెల్లిస్తుండటంతో పెద్దగా నగదు అవసరం లేకుండా పోయింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఏటీఎంలు బోసిపోతున్నాయి. కరోనా భయంతో ఏటీఎంలకు వెళ్లి నగదు డ్రా చేసేందుకు నగర వాసులు వెనుకాడుతున్నారు. ఇంటి గుమ్మం ముందే బ్యాంకు ఖతాలోని నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు ఖాతాదారులకు ఉంది. ఇప్పటికే తపాలా శాఖ వివిధ బ్యాంకుల ఖాతాదారులకు ఇంటి ముంగిటకే నగదు సేవలు అందిస్తోంది. ఎస్‌బీఐ కూడా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. (చదవండి: ఓటుందో.. లేదో.. చెక్ చేసుకోండి)
Comments
Please login to add a commentAdd a comment