అమాయకులు, వృద్ధులే వారి టార్గెట్‌ | Five Atm fraudsters from Bihar Arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

అమాయకులు, వృద్ధులే వారి టార్గెట్‌

Published Fri, Jul 9 2021 1:11 PM | Last Updated on Fri, Jul 9 2021 1:14 PM

Five Atm fraudsters from Bihar Arrested In Hyderabad - Sakshi

నిందితులను చూపిస్తున్న పోలీసులు

రాంగోపాల్‌పేట్‌: ఏటీఎంకు వెళ్లిన అమాయకులను, వృద్ధులను టార్గెట్‌ చేసి వారి ఏటీఎం కార్డును స్కిమ్మింగ్, క్లోనింగ్‌ చేసి నగదును తస్కరిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్, డీఐ వీరయ్య, ఎస్సైలు శ్రీను, యుగందర్‌రెడ్డిలు వివరాలు వెల్లడించారు. బీహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన పురుషోత్తం కుమార్‌ (20), అదే ప్రాంతానికి చెందిన రవికాంత్‌కుమార్‌ (19)లు పాట్నాలో సేప్టీ మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసిస్తున్నారు. నవాడా జిల్లాకు చెందిన నితీష్‌కుమార్‌ (19) ఢిల్లీ లోని ఓ రేషన్‌ షాపులో పనిచేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన పికు కుమార్‌ (23) భూపాల్‌లో బీఈ చదువుతున్నాడు. అదే జిల్లాకు చెందిన నిరంజన్‌కుమార్‌ (32) చిరు వ్యాపారం చేస్తున్నాడు. ఈ ఐదుగురు స్నేహితులు కాగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో పురుషోత్తం కుమార్‌ ఏటీఎం కార్డులను క్లోనింగ్‌ చేసి వాటి ద్వారా నగదును తస్కరించాలని పథకం పన్ని కార్డుల్లోని డేటాను రైడ్, రీడ్‌ చేసే డెఫ్టన్‌ ఎంఎస్‌ఆర్‌ ఎక్స్‌6 మిషన్‌ను ఒక యాప్‌ను తయారు చేశారు. తమ పథకాన్ని అమలు పరిచేందుకు ఐదుగురు గ్యాంగ్‌ సభ్యులు కొద్ది రోజుల క్రితం నగరానికి వచ్చారు. ఏటీఎంలోకి డబ్బు డ్రా చేసేందుకు వెళ్లిన వ్యక్తి ఏదైనా కంగారు పడితే వెంటనే సహాయం చేసినట్లు నటిస్తారు. కార్డు తీసుకుని రివర్స్‌లో మిషన్‌లో పెట్టి అతని దృష్టిని ఏటీఎం స్క్రీన్‌ నుంచి మరల్చి 

తమ దగ్గర ఉన్న డెఫ్టన్‌ ఎంఎస్‌ఆర్‌ ఎక్స్‌ 6 మిషన్‌లో కార్డును ఉంచి క్షణాల్లో అందులో ఉన్న డేటాను తస్కరిస్తారు. ఆ డేటా మొత్తం వీళ్ల వద్ద ఉన్న యాప్‌లో నిక్షిప్తం అవుతుంది. అటు తర్వాత వీళ్ల దగ్గర ఉన్న మరో డూప్లికేట్‌ కార్డులోకి ఈ డేటాను మొత్తం తరలిస్తారు. ఏటీఎంలో ఉన్న వ్యక్తి లావాదేవీలు నిర్వహించుకునే సమయంలో పిన్‌ నంబర్‌ను గుర్తు పెట్టుకుంటారు. అటు తర్వాత తమ వద్ద ఉన్న డూప్లికేట్‌ కార్డు ద్వారా నగదును డ్రా చేస్తారు. ఇలాగే ఉత్తర్‌ఖండ్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి శుభం కుమార్‌ గౌర్, అతని స్నేహితుడు ఆకాష్‌కుమార్‌లు రైల్వే ట్రాక్‌ టెస్టింగ్‌ విధులకు వచ్చి రెజిమెంటల్‌బజార్‌లోని పంచవటి రెసిడెన్సీలో ఉంటున్నారు. జూన్‌ 26వ తేదీన ఆకాష్‌ రెజిమెంటల్‌బజార్‌ చాంద్‌ దర్గా ప్రాంతంలోని యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంకు వెళ్లి రూ.25 వేల నగదును డ్రా చేశారు. అటు తర్వాత ఆకాష్‌ ఖాతా నుంచి 28వ తేదీన రూ.10వేలు, రూ.5,500 నగదు రెండుమార్లు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు తన ఖాతా నుంచి నగదును తస్కరించినట్లు గుర్తించిన ఆయన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు ఇలాగే పలు ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి రూ.5లక్షల వరకు తస్కరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వారి నుంచి 2.85 లక్షల నగదు, 6 మొబైల్‌ ఫోన్లు, కార్డు డేటా చోరి చేసే మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement