సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రహదారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్‌మాల పరియోజన–1 కింద గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ మీదుగా మూడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఐదు గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు.
బీఆర్‌ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ అడిగిన ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్– విశాఖపట్నం (222 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్, షోలాపూర్ – కర్నూల్ – చెన్నై (329 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.
ఇండోర్–హైదరాబాద్ (525 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణం పాక్షికంగా పూర్తయిందని పేర్కొన్నారు. భారత్‌మాల పరియోజన –1 కింద తెలంగాణలో రూ.38,279 కోట్లతో 1,719 కి.మీ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.22,749 కోట్లతో 1,026 కి.మీ. పొడవైన రహదారుల నిర్మాణం జరుగుతోందని గడ్కరీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment