సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్‌తో పీఆర్సీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోందా? అంటే ఉద్యోగ వర్గాలు ఔననే అంటున్నాయి. ఆ దిశగా ఆర్థికశాఖ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఆర్థికశాఖ త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేతన సవరణ సంఘం(పీఆర్సీ) గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుండగా మరో మూడు నెలలు.. అంటే మార్చి 31 వరకు పొడిగించేలా ప్రతిపాదనలు పంపిందనే వాదన కూడా చర్చనీయాంశమైంది. ఈ మేరకు పీఆర్సీ చైర్మన్ సీఆర్ బిస్వాల్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు చేరాయని అంటున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ గడువు పెంచడం కంటే ఉద్యోగులకు మేలుచేసే విధంగానే ముందుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోందనే చర్చ జరుగుతోంది.
ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా 30 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించి.. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నగదు రూపంలో అమలు చేసేలా ప్రతిపాదన రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) అమలు చేస్తున్న నేపథ్యంలో 30 శాతం ఫిట్‌మెంట్ కంటే తక్కువ ఇచ్చి పీఆర్సీ అమలుచేస్తే ఉద్యోగ సంఘాలు ఒప్పుకోవని.. అందువల్లే 30 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక 2018 జూలై 1 నుంచి 2021 మార్చి 31 వరకు నోషనల్‌గా పీఆర్సీని అమలు చేయాలనే ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌కు పంపించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచేలా కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment