65 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల
నేడు నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తివేత!
ఐదారు రోజుల్లో వరద శ్రీశైలానికి చేరుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో సోమవారం విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,04,050 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 1,698.95 అడుగుల్లో 100 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో.. బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల మహారాష్ట్ర లో ముంపు సమస్య ఉత్పన్నం కాకుండా నివారించేందుకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆల్మట్టి గేట్లను ఎత్తి 65 వేల క్యూసెక్కులు దిడువకు విడుదల చేస్తున్నారు. గతేడాది జూలై 27న ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తారు.
ఈ ఏడాది 11 రోజుల ముందుగానే గేట్లు ఎత్తడం గమనార్హం. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి వరద చేరుకుంటోంది. ప్రస్తుతం నారాయణపూర్ డ్యామ్‌లోకి 22,621 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 1608.2 అడుగుల్లో 28.76 టీఎంసీలకు చేరుకుంది. నారాయణపూర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,615 అడుగులు కాగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు. బుధవారానికి డ్యామ్‌లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోనుంది. దాంతో సాయంత్రం డ్యామ్ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.
నారాయణపూర్ దిగువన తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.68 టీఎంసీలు ఉన్నాయి. వరద ఉధృతి వారం పాటు ఇదే రీతిలో కొనసాగే అవకాశం ఉండటంతో.. ఐదారు రోజుల్లో శ్రీశైలానికి ప్రవాహం చేరుకునే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 32,262 క్యూసెక్కులు తరలిస్తుండటంతో నీటి నిల్వ 35.63 టీఎంసీలకు తగ్గింది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment