సాక్షి, మెదక్: మెదక్ అడిషనల్ కలెక్టర్ (ఏసీ) నగేశ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఉద్యోగులు పత్తా లేకుండా పోయారు. దీంతో కలెక్టరేట్ ఉద్యోగుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాల నిషేధిత భూమికి ఎన్‌ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం కేసులో అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురు అరెస్టు అయిన విషయం విదితమే. ఎప్పుడైతే నగేశ్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు మొదలు పెట్టారో.. అప్పటి నుంచి వీరంతా అదృశ్యమయ్యారు. మరోవైపు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎన్‌ఓసీకి అనుమతి ఇవ్వాలని మెదక్ మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి సంతకం చేసి పంపించినట్లు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి లేఖ వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది.
సన్నిహితంగా ఆ ముగ్గురు
అడిషనల్ కలెక్టర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఉద్యోగులు అదృశ్యమవడంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. నగేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినప్పటి నుంచి ఇంత వరకు వారి ఆచూకీ కనిపించడం లేదు. ఈ ముగ్గురిలో ఒకరు కలెక్టరేట్ పరిపాలనా విభాగంలో పనిచేస్తారు.. మరొకరు అడిషనల్ కలెక్టర్ కార్యాలయంలో నిత్యం అన్నీ తానై వ్యవహరిస్తారు.. ఇంకొకరు అన్నింటా సహకరించే వ్యక్తి. వీరు సడన్‌గా మాయమవడంతో ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారన్న ప్రచారం సాగుతోంది. వివిధ పనులకు రూరల్ ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చినవారు గతంలో పరిచయమున్న సిబ్బంది లేకపోవడంతో గుసగుసలాడుకున్నారు.
ధర్మారెడ్డిని విచారించే అవకాశం
ఈ భూ వ్యవహారంలో మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పేరు వినిపించడం కలకలం సృష్టించింది. 112 ఎకరాలకు ఎన్‌ఓసీ కోసం అదనపు కలెక్టర్ నగేశ్.. భూమి కొనుగోలు చేసిన లింగమూర్తితో రూ.1.12 కోట్లకు జూలై 31న బేరం కుదుర్చుకున్నారు. భూ ఎన్‌ఓసీకి సంబంధించిన ఫైలు ఆగస్టు 21న తహసీల్దార్, 23న ఆర్డీవో, 25న కలెక్టర్‌కు చేరింది. ఆ తర్వాత జూలై 31న మూర్తితో రూ.1.12 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు. ఇదే రోజు కలెక్టర్ ఉద్యోగ విరమణ పొందారు. అయితే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వెలుగులోకి వచ్చిన లేఖలో 112 ఎకరాలకు ఎన్‌ఓసీకి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ నుంచి ఫైలు అందిందని ఉంది.
ఈ నేపథ్యంలో ఆయన పాత్రపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పదవీ విరమణ రోజు ఆ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందనే కోణంలోనూ వారు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు .. ధర్మారెడ్డి పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన ఇంకా మెదక్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయలేదని సమాచారం. ఆ బంగ్లాలో పనిచేసే సిబ్బందికి రోజు ఫోన్ చేసి ఆరా తీసే ధర్మారెడ్డి.. అడిషనల్ కలెక్టర్ వివాదం తర్వాత అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని సిబ్బంది చెబుతున్నారు. ఏదేమైనా త్వరలో ఆయనను విచారించడం ఖాయమని అవినీతి నిరోధక శాఖకు చెందిన ఒకరు స్పష్టం చేశారు. మొత్తానికి రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇంకెందరి పాత్రలు ఉన్నాయోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
తహసీల్దార్ మాలతికి ప్రశ్నల వర్షం
చిప్పల్‌తుర్తి గ్రామంలోని 58, 59 సర్వే నంబర్లలోని భూమి ఎన్‌ఓసీకి దరఖాస్తు సమయంలో నర్సాపూర్ తహసీల్దార్ మాలతి సెలవులో ఉన్నారు. అప్పుడు ఆర్డీవో అరుణారెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దార్‌గా ఉన్న సత్తార్‌కు ఈ వ్యవహారంలో రూ.లక్ష చొప్పున ముట్టినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఆర్డీవోను హైదరాబాద్‌కు తీసుకెళ్లేటప్పుడు మాలతిని సైతం తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఆర్డీవో మహిళ కావడంతో మాలతిని ఆమెకు తోడుగా తీసుకెళ్లినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. అయితే.. అక్కడికి వెళ్లిన తర్వాత మాలతిని కూడా విచారించినట్లు సమాచారం. ఆ సమయంలో ఎందుకు సెలవు పెట్టారు?.. ఎవరైనా ఒత్తిడి చేశారా?.. ఇబ్బందులు పెట్టారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. వ్యక్తిగత సమస్యలతో సెలవు పెట్టినట్లు ఆమె సమాధానం ఇచ్చారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment