సాక్షి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్‌వోసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసి కటకటాలపాలైన అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ కేసు దర్యాప్తులో వేగం పెంచేందుకు అవినీతి నిరోధక శాఖ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఏసీ నగేశ్‌కు రూ.40 లక్షలు ముట్టినట్లు ఆడియో రికార్డులు లభ్యం కాగా.. మిగతా రూ.72 లక్షలకు బినామీ జీవన్‌గౌడ్ పేరిట అగ్రిమెంట్ పత్రా లు దొరికిన విషయం తెలిసిందే. మరిన్ని ఆధారాల కోసం ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో దాల సమయంలో లాకర్ కీ లేదని అదనపు కలెక్టర్ మొండికేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు బోయిన్‌పల్లిలోని ఓ బ్యాంకులో లాకర్, మాచవరంలోని ఇంట్లో బీరువా తెరవలేకపోయారు.
బినామీలు, వారి ఖాతాలపై నజర్
సోదాల్లో పలు కీలక పత్రాలు లభించగా.. మరికొందరు వ్యక్తులు ఏసీ బినామీలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఈ మేరకు వారిపై ఇప్పటికే నిఘాపెట్టారు. ఏసీబీ సోదాలు ప్రారంభమైనప్పటి నుంచి అదనపు కలెక్టర్‌తో సన్నిహితంగా ఉండే కార్యాలయ ఉద్యోగులు కొందరు పత్తా లేకుండా పోయారు. వీరితోపాటు జిల్లాలో భూవ్యవహారాల్లో తలదూర్చిన మరికొందరు వ్యక్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. వారి ఆస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను ఆరా తీస్తున్నారు.
రియల్టర్‌పై నజర్..
మెదక్ జిల్లాలో రెండు చోట్ల విద్యాసంస్థలు నిర్వహిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి.., అలాగే కలెక్టరేట్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు భూవ్యవహారాల్లో ఏసీకి అన్నీ తామై కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. వీరు హైదరాబాద్ కేంద్రంగా తతంగం నడిపించినట్లు గుర్తించారు. వీరిని సైతం ఏసీబీ త్వరలో విచారించనున్నట్లు తెలిసింది.
లాకర్, బీరువా తెరిచేందుకు సన్నాహాలు
ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న నగేశ్‌ను ఏసీబీ అధికారులు త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. సోదాల సమయంలో అదనపు కలెక్టర్ దంపతులు అధికారులకు సహకరించకుండా బ్యాంక్ లాకర్, బీరువా తాళం చెవులు లేవంటూ మొండికేశారు. దీంతో కోర్టు ఆదేశాలతో వీటిని తెరిచేందుకు అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. వీటిని తెరిస్తే నగదు, బినామీల బాగోతం వెలుగుచూడొచ్చని అధికారులు భావిస్తున్నారు.
త్వరలో మాజీ కలెక్టర్‌కు నోటీసులు
చిప్పల్‌తుర్తి భూములకు సంబంధించి 112 ఎకరాలను నిషేధిత భూముల జాబితా 22–ఏ నుంచి తొలగించాలని రిజిస్ట్రేషన్ శాఖకు మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి లేఖ రాసినట్లు వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది. ఈ మేరకు ఆయనను విచారించేందుకు ఏసీబీ అధికారులు అన్నీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ కేసులో పట్టుబడిన ఆర్డీఓ అరుణారెడ్డి ఏసీబీకి కీలక సమాచారం ఇవ్వడంతో అధికారులు దూకుడుగా ముం దుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment