సాక్షి, మెదక్: అదనపు కలెక్టర్ అవినీతి బాగోతంలో కొత్తకోణం వెలుగుచూసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలో తన బినామీతో కలసి సుమారు 20 ఎకరాల్లో ఉన్న గుట్టకే ఎసరు పెట్టేందుకే యత్నించారు. ఈ విషయం తాజాగా శనివారం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. పాంబండ గ్రామ శివారులో సర్వే నంబర్ 142లోని ప్రభుత్వ భూమిలో ఇరవై ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. ఇందులో క్వారీ ఏర్పాటుకు రెండేళ్ల క్రితం అదనపు కలెక్టర్ నగేశ్ బినామీ కోల జీవన్ గౌడ్ శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తహసీల్దార్ భానుప్రకాశ్ దీనికి అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. గుట్టకు ఆనుకుని అటవీ ప్రాంతం, గ్రామం ఉండటంతో నిబంధనల ప్రకారం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంతే కాదు.. ఫైలును వెనక్కి పంపించారు.
పలు రకాలుగా ఒత్తిళ్లు
ఎలాగైనా క్వారీకి అనుమతులు పొందాలని జీవన్‌గౌడ్ విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. క్వారీ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు లేనప్పటికీ.. ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎత్తుగడలు వేశారు. అదనపు కలెక్టర్ నగేశ్‌ను రంగంలోకి దించడంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో సిఫార్సుసు చేయించినట్లు తెలిసింది. క్వారీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్‌పై పలు రకాలుగా ఒత్తిడి తెచ్చారు. అయినా ఆయన ససేమిరా అన్నారు. కాగా, ఎవరు చెప్పినా తహసీల్దార్ వినకపోవడంతో అదనపు కలెక్టర్ దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. క్వారీ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని నాలుగైదు నెలలుగా సదరు తహసీల్దార్‌పై ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ ఆయన స్పందించలేదు. దీన్ని మనసులో పెట్టుకుని తహసీల్దారుపై ఏసీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే వారని.. ఎప్పుడూ ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవారని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
ఏసీబీ దాడులతో వెలుగులోకి..
నిజామాబాద్ జిల్లాలో ఆర్డీఓగా పనిచేసినప్పుడు నగేశ్‌కు నిర్మల్ జిల్లాకు చెందిన జీవన్‌గౌడ్ పరిచయమయ్యాడు. అప్పటి నుంచి భూ వ్యవహార లావాదేవీల్లో అదనపు కలెక్టర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. జాయింట్ కలెక్టర్‌గా నగేశ్ మెదక్ జిల్లాకు వచ్చినప్పటికీ అతడికి జీవన్‌గౌడ్ బినామీగా వ్యవహరించడం.. వారిద్దరి మధ్య స్నేహం ఏ పాటిదో తెలుస్తోంది. అయితే రూ.112 ఎకరాల భూమికి ఎంఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం ఘటనలో అదనపు కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం.. అతడి బినామీ జీవన్‌గౌడ్‌నూ అరెస్టు చేయడంతో జీవన్‌గౌడ్ పాంబండ కేంద్రంగా గుట్టకు ఎసరు పెట్టిన ప్రయత్నాలు వెలుగు చూశాయి. కాగా.. క్వారీ లీజుకు తీసుకోవాలని అదనపు కలెక్టర్ భావించారా.. జీవన్ గౌడ్ సొంతంగా తీసుకోవాలని అనుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఒత్తిడికి తలొగ్గలేదు: శివ్వంపేట తహసీల్దార్
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో నెలకొన్న పలు భూ వివాదాలపై తనపై ఎంతో మంది ఒత్తిడి తీసుకొచ్చినా.. తలొగ్గ లేదని, అందుకే ఈ రోజు తలెత్తుకొని ఉన్నానని, లేకుంటే తాను కూడా జైలులో ఉండేవాడినని తహసీల్దార్ భానుప్రకాశ్ అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ శివ్వంపేటలో నెలకొన్న భూ సమస్యల గురించి ప్రస్తావించిన విషయం గురించి తహసీల్దార్ భానుప్రకాశ్ వివరణ ఇచ్చారు. పాంబండ, పిల్లుట్ల గ్రామాలకు సంబంధించిన వివాదాస్పద భూముల విషయంపై చాలా మంది ఒత్తిడి తీసుకొచ్చారని, అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయిన జీవన్‌గౌడ్ సైతం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment