Bhanuprakash
-
ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను: చిరంజీవి
‘‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా. పెద్ద మనసుతో చూస్తే, మిమ్మల్ని (ప్రేక్షకులు) రంజింపజేస్తుంది. నా మాట నమ్మి వెళ్లినవాళ్లకి నష్టం జరగదని భరోసా ఇస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఆచార్య’ తీస్తున్నప్పుడు నిరంజన్, అవినాష్‌కి ఎప్పుడు సమయం కుదిరిందో తెలియదు కానీ ‘మిషన్ ఇంపాజిబుల్’ తీశారు. తాప్సీ, స్వరూప్ వంటి మంచి కాంబినేషన్లో ఈ సినిమా తీయబట్టే, ప్రీ రిలీజ్‌కి రావాలని నిరంజన్ అడగ్గానే వస్తానని చెప్పాను. ఈ సినిమా చూశాను.. అద్భుతంగా ఉంది. తాప్సీ, ముగ్గురు పిల్లలు చాలా బాగా నటించారు. విషయం, పరిజ్ఞానం, ప్రతిభ ఉన్న డైరెక్టర్ స్వరూప్. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా అంటున్నారు కానీ రిలీజ్ అయ్యాక పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు. నిర్మాతలు ఇన్వాల్వ్ కావాలి: కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే కాని నిరంజన్ ఓకే చెప్పడు. ‘ఆచార్య’ కూడా తను ఓకే అన్నాకే మా వద్దకు వచ్చింది. కథలో, కథల ఎంపికలో నిర్మాతల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నిర్మాత అనేవాడు ఓ క్యాషియర్, ఫైనాన్స్ సపోర్ట్ చేసేవాడు అనేట్లుగా పరిస్థితి మారింది. దానికి కారణం నిర్మాతలు కాదు.. నిర్మాతలను కథల ఎంపికలో ఇన్వాల్వ్ చేయాలి. నా నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, కేఎస్ రామారావు, దేవీ వరప్రసాద్.. ఇలా ఎంతోమంది పూర్తిగా కథ, సంగీతం.. ఇలా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. దానివల్ల డైరెక్టర్స్‌తో పాటు నటీనటులకు ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా ఇప్పుడు నిర్మాతల చేతుల్లో నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుండటం బాధగా ఉంది. ఇలాంటి రోజుల్లో అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్న నా నిర్మాత నిరంజన్ అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అనిపిస్తోంది ‘ఝుమ్మంది నాదం’ అప్పుడు తాప్సీని చూసి ‘వావ్.. ఎంత బాగుంది.. యాక్టివ్‌గా ఉంది’ అనుకున్నాను.. అప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లి, తనతో సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయాను. ఒక్కోసారి తాప్సీలాంటి వాళ్లని చూసినప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను. ‘మెయిన్ లీడ్‌గా తను నాతో చేసే అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వకూడదు (నవ్వుతూ).. తనని కమిట్ చేయిద్దాం.. నిర్మాత నువ్వే అవ్వాలి. స్టేజ్‌పై ఉన్న ఈ యంగ్ డైరెక్టర్స్‌లో లాటరీ వేసి ఒక్కర్ని ఓకే చేయ్’ అని నిరంజన్‌ని ఉద్దేశించి అన్నారు చిరంజీవి. ఇంకా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘ఆర్ఆర్ఆర్’ తెలుగు, భారతీయ చిత్రపరిశ్రమ గర్వించే సినిమా అయింది. ఇక ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి సినిమాలను ఆదరించినప్పుడే ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్‌కి ప్రోత్సాహంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మిషన్ ఇంపాజిబుల్’ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మంచి డైరెక్టర్స్‌కి మంచి నటీనటులు తోడైతే ‘మిషన్ ఇంపాజిబుల్, ఆచార్య’ వంటి సినిమాలొస్తాయి’’ అన్నారు నిరంజన్ రెడ్డి. తాప్సీ మాట్లాడుతూ– ‘‘హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడెందుకు తెలుగు సినిమాలు చేస్తున్నారు? అని కొందరు అడుగుతున్నారు. మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది మరచిపోకూడదు. నా ప్రయాణం తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది.. అందుకే తెలుగు సినిమాలు చేస్తా.. చేస్తూనే ఉంటా’’ అన్నారు. -
గుట్టకే ఎసరుకు యత్నం
సాక్షి, మెదక్: అదనపు కలెక్టర్ అవినీతి బాగోతంలో కొత్తకోణం వెలుగుచూసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలో తన బినామీతో కలసి సుమారు 20 ఎకరాల్లో ఉన్న గుట్టకే ఎసరు పెట్టేందుకే యత్నించారు. ఈ విషయం తాజాగా శనివారం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. పాంబండ గ్రామ శివారులో సర్వే నంబర్ 142లోని ప్రభుత్వ భూమిలో ఇరవై ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. ఇందులో క్వారీ ఏర్పాటుకు రెండేళ్ల క్రితం అదనపు కలెక్టర్ నగేశ్ బినామీ కోల జీవన్ గౌడ్ శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తహసీల్దార్ భానుప్రకాశ్ దీనికి అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. గుట్టకు ఆనుకుని అటవీ ప్రాంతం, గ్రామం ఉండటంతో నిబంధనల ప్రకారం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంతే కాదు.. ఫైలును వెనక్కి పంపించారు. పలు రకాలుగా ఒత్తిళ్లు ఎలాగైనా క్వారీకి అనుమతులు పొందాలని జీవన్‌గౌడ్ విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. క్వారీ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు లేనప్పటికీ.. ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎత్తుగడలు వేశారు. అదనపు కలెక్టర్ నగేశ్‌ను రంగంలోకి దించడంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో సిఫార్సుసు చేయించినట్లు తెలిసింది. క్వారీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్‌పై పలు రకాలుగా ఒత్తిడి తెచ్చారు. అయినా ఆయన ససేమిరా అన్నారు. కాగా, ఎవరు చెప్పినా తహసీల్దార్ వినకపోవడంతో అదనపు కలెక్టర్ దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. క్వారీ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని నాలుగైదు నెలలుగా సదరు తహసీల్దార్‌పై ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ ఆయన స్పందించలేదు. దీన్ని మనసులో పెట్టుకుని తహసీల్దారుపై ఏసీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే వారని.. ఎప్పుడూ ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవారని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఏసీబీ దాడులతో వెలుగులోకి.. నిజామాబాద్ జిల్లాలో ఆర్డీఓగా పనిచేసినప్పుడు నగేశ్‌కు నిర్మల్ జిల్లాకు చెందిన జీవన్‌గౌడ్ పరిచయమయ్యాడు. అప్పటి నుంచి భూ వ్యవహార లావాదేవీల్లో అదనపు కలెక్టర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. జాయింట్ కలెక్టర్‌గా నగేశ్ మెదక్ జిల్లాకు వచ్చినప్పటికీ అతడికి జీవన్‌గౌడ్ బినామీగా వ్యవహరించడం.. వారిద్దరి మధ్య స్నేహం ఏ పాటిదో తెలుస్తోంది. అయితే రూ.112 ఎకరాల భూమికి ఎంఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం ఘటనలో అదనపు కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం.. అతడి బినామీ జీవన్‌గౌడ్‌నూ అరెస్టు చేయడంతో జీవన్‌గౌడ్ పాంబండ కేంద్రంగా గుట్టకు ఎసరు పెట్టిన ప్రయత్నాలు వెలుగు చూశాయి. కాగా.. క్వారీ లీజుకు తీసుకోవాలని అదనపు కలెక్టర్ భావించారా.. జీవన్ గౌడ్ సొంతంగా తీసుకోవాలని అనుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఒత్తిడికి తలొగ్గలేదు: శివ్వంపేట తహసీల్దార్ మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో నెలకొన్న పలు భూ వివాదాలపై తనపై ఎంతో మంది ఒత్తిడి తీసుకొచ్చినా.. తలొగ్గ లేదని, అందుకే ఈ రోజు తలెత్తుకొని ఉన్నానని, లేకుంటే తాను కూడా జైలులో ఉండేవాడినని తహసీల్దార్ భానుప్రకాశ్ అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ శివ్వంపేటలో నెలకొన్న భూ సమస్యల గురించి ప్రస్తావించిన విషయం గురించి తహసీల్దార్ భానుప్రకాశ్ వివరణ ఇచ్చారు. పాంబండ, పిల్లుట్ల గ్రామాలకు సంబంధించిన వివాదాస్పద భూముల విషయంపై చాలా మంది ఒత్తిడి తీసుకొచ్చారని, అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయిన జీవన్‌గౌడ్ సైతం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. -
మత్యువు గెలిచింది.. ప్రేమ ఓడింది
హైదరాబాద్: బంధువుల అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. అమ్మాయి కూడా ఇష్టపడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంతలో ఏమైందో మూడు నెలల క్రితం ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం జరిగిపోయింది. దీంతో ఆవేదన తట్టుకోలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయినగర్‌కు చెందిన భానుప్రకాష్(32) పెయింటర్. దగ్గరి బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. మూడు నెలల క్రితం ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరగడంతో అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. ఆమె లేని జీవితం వ్యర్ధం అనుకుని మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఫలించకపోవడంతో మరొకసారి కత్తితో పొడుచుకునేందుకు యత్నించాడు. ఆఖరకు మధ్యాహ్నం రెండన్నర గంటల సమయంలో ఇంటికి సమీపంలో గౌతంనగర్ రైల్వేగేట్ వద్ద కాచిగూడ నుంచి మేడ్చెల్‌కు వెళ్లే రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పై మృతుడి సోదరుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను కత్తితో పొడిచి చంపిన ఎస్సై
కన్న బిడ్డల ఎదుటే దారుణం ఆర్థిక ఇబ్బందులే కారణమని వెల్లడి హైదరాబాద్: జీవితాంతం తోడుండాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడుగా మారాడు.. ఆర్థిక సమస్యలతో ఆవేశానికి లోనై తనలో సగభాగాన్ని కిరాతకంగా చంపేశాడు. కన్నబిడ్డల ఎదుటే భార్యను కత్తితో పొడిచి చివరికి పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ సీఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కడప పట్టణానికి చెందిన భానుప్రకాశ్ (45), సౌజన్య(37)లది ప్రేమ వివాహం. వీరికి తన్మయ్, కౌశిక్ ఇద్దరు సంతానం. ప్రస్తుతం కేపీహెచ్‌బీ కాలనీ సమతానగర్ ప్రసాద్ రెసిడెన్సీ అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. కాగా, భానుప్రకాష్ నగరంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే అధికారులకు చెప్పకుండా మూడేళ్ల పాటు దీర్ఘకాలిక సెలవు తీసుకున్నాడు. దీంతో అధికారులు పలుమార్లు అతనికి నోటీసులు జారీ చేశారు. అయినా భానుప్రకాశ్ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో గత ఏడాది అతడిని సస్పెండ్ చేశారు. నాలుగు నెలల కిందటే కేపీహెచ్‌బీ కాలనీలోని ప్రసాద్ రెసిడె న్సీలో వీరి కుటుంబం అద్దెకు దిగింది. ఉద్యోగం పోవడంతో జీతం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ తరుణంలో దంపతులిద్దరూ రోజూ గొడవ పడేవారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం భానుప్రకాశ్, సౌజన్యల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆవేశానికిలోనైన భానుప్రకాష్ కత్తితో పొడిచి భార్యను దారుణంగా హత్య చేశాడు. తర్వాత తన ఇద్దరు పిల్లలను ఆల్విన్‌కాలనీలో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. అనంతరం కేపీహెచ్‌బీ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)