రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ప్రకృతితో మమేకమై స్వచ్ఛంగా ఉండే ఆదివాసీలు అభివృద్ధి చెందినపుడే దేశం అభివృద్ధి చెందినట్లని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని అభిప్రాయపడ్డారు. ఆధార్ సొసైటీ, ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమం సాంస్కృతిక సంస్థ, ఆదివాసీ విద్యార్థి మండలి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలకు ఆమె హాజరై మాట్లాడారు.
ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడమంటే భగవంతుడికి సేవ చేయడమేనన్నారు. గవర్నర్‌గా ఇక్కడికి వచ్చాక ఆరు ఆది వాసీ గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ సర్వే చేయించగా...అక్కడి మహిళలు రక్తహీనతతో అధికంగా బాధపడుతున్నట్లు తేలిందని, వారికి ఐరన్ మాత్రలు పంపించగా...వాటిని తీసుకునేందుకు వారు ఇష్టపడలేదని వివరించారు. దీంతో ఐరన్ ఎక్కువగా లభించే మహువా పూలతో తయారు చేసిన లడ్డూలను పంపిణీ చేస్తే చాలామంది మహిళలు రక్తహీనతనుంచి బయటపడ్డారని తెలిపారు.
కార్యక్రమం అనంతరం ఆదివాసీలతో కలసి గవర్నర్ నృత్యాలు చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ..ఆర్టి కల్ 244 ప్రకారం ఆదివాసులకు ప్రత్యేక రక్షణ చట్టాలున్నాయని, కానీ వాటిని పరిరక్షించడం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆధార్ సొసైటీ జాతీయ అధ్యక్షులు వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment