
సాక్షి, హైదరాబాద్: సకల జనుల సమ్మె కాలపు వేతనాలను ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అందుకోబోతున్నారు. పదకొండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు వారికి ఆ మొత్తం అందబోతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 2011 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 వరకు సకల జనుల సమ్మె జరిగిన విషయం తెలిసిందే. తర్వాత సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆర్టీసీలో వెంటనే అమలు కాలేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నా.. సెలవు కాలపు వేతనాన్ని విధుల్లో ఉన్న ఉద్యోగులకే చెల్లించారు. ఆ సమయానికే పదవీ విరమణ పొందిన 8,053 మందికి ఇవ్వలేదు.
దీంతో ఆ వేతనం కోసం వారు 11 ఏళ్లుగా పోరాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య నేతలతో మంత్రుల చర్చల సందర్భంగా ఈ డిమాండ్ పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 3 డీఏలు, దసరా పండుగ అడ్వాన్సులాంటి వాటితోపాటు పదవీ విరమణ పొందిన అర్హులకు సమ్మె కాలపు వేతనం కింద రూ.25 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్ పేరుతో సర్క్యులర్ శనివారం జారీ అయింది.
చదవండి: కరెంట్ నష్టాల్లో... కుమురం భీం టాప్!
Comments
Please login to add a commentAdd a comment