సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మద్యం, డబ్బు, విందు వినోదాలతో దీపావళి పండుగ తరువాత పూర్తి స్థాయిలో మునుగోడు ఓటర్లను ఆకర్షించేందుకు కసరత్తు జరుగుతోంది. దీపావళి పండుగ కోసం ఇతర ప్రాంతాల నుంచి మునుగోడు నియోజకవర్గంలోని స్వగ్రామాలకు వచ్చే ప్రతి ఓటరును వీలైతే పోలింగ్ వరకు అక్కడే స్వగ్రామాల్లోనే ఉండేలా ఒప్పించడం, కుదరకపోతే కచ్చితంగా పోలింగ్ రోజున వచ్చేలా అవసరమైన మొత్తాన్ని అందజేసి ఓటర్లను తమ అధీనంలోకి తెచ్చుకునే లక్ష్యంతో ప్రధాన పార్టీలు కదులుతున్నాయి. ఇప్పటికే కులాల వారీగా నియోజకవర్గం బయట, హైదరాబాద్‌లో ఉన్న కుటుంబాలకు దీపావళి క్రాకర్స్, ప్రత్యేక గిఫ్ట్ బాక్సులు వంటి తాయిలాలను అందిస్తున్నాయి.
బూత్ స్థాయినుంచే..
పండుగ తర్వాత ప్రత్యేక వ్యూహంతో బూత్ స్థాయిలోనే ఓటర్లను ఆకర్షించే విధంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రతి బూత్ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు.. వారు ఎవరు చెబితే వింటారు. వారికి ఏం కావాలి.. వారికున్న అవసరాలేంటి? ఎలా తమ వైపునకు తిప్పుకోవాలన్న దానిపై ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో బూత్ స్థాయిలో మరింత పకడ్బందీ ప్రణాళికతో డబ్బు పంపిణీ చేసి తమ వైపు తిప్పుకునేలా స్కెచ్ వేస్తున్నాయి. ఇప్పటికే ఓ పార్టీకి చెందిన డబ్బు క్షేత్ర స్థాయికి చేరిపోయింది. మరో పార్టీ డబ్బును ఎలా చేరవేయడం అన్న విషయంలో ఆలోచనలు చేస్తోంది. ఇంకో పార్టీ బూత్‌ల వారీగా నియమితులైన ఇన్‌చార్జీలకే ఆ పనుల బాధ్యతలను అప్పగించింది.
ఈ నెలాఖరులో భారీ ఎత్తున బహిరంగ సభలు, రోడ్‌షోల నిర్వహణకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నెల 30న సీఎం కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించేలా టీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్‌రావుల రోడ్‌షోలను భారీగా నిర్వహించింది. బీజేపీ కూడా 29వ తేదీన లేదంటే 31వ తేదీన అమిత్‌షా లేదా జేపీ నడ్డాతో బహిరంగ సభ నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలతో బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. మొత్తానికి అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు మొదలుకొని కిందిస్థాయి నాయకులంతా మునుగోడులోనే మోహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment