
మీడియాతో మాట్లాడుతున్న శ్రీనివాసరావు. చిత్రంలో డీఎంఈ రమేష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ అదుపులోనే ఉంది కానీ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. సెకండ్ వేవ్ మరో రెండు మూడు నెలలు కొనసాగుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఫస్ట్ వేవ్ దాదాపు ఎనిమిది నెలలు కొనసాగిందని, అదే సెకండ్ వేవ్ కేవలం మూడు నెలల్లోనే విజృంభించిందని అన్నారు. ఒక రోజులో దేశవ్యాప్తంగా గరిష్టంగా 4 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటికీ రోజుకు 35 వేల నుంచి 40 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఫస్ట్ వేవ్‌లో ఆల్ఫా రకం వైరస్ వ్యాప్తి చెందిందని, సెకండ్ వేవ్‌లో డెల్టా రకం విజృంభిస్తోందని తెలిపారు. భారత్‌లో మొదలైన ఈ రకం వైరస్ ఇప్పుడు 115కు పైగా దేశాలను వణికిస్తోందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి కరోనాను కట్టడి చేసిందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు.
ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
‘రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో వైరస్ ఇంకా విజృంభిస్తోంది. హుజూరాబాద్ నియోజక వర్గంలో మూడు నాలుగు మండలాల్లో కేసులు పెరుగుతున్నాయి. అందుకే ఆయా ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత సామాజిక బాధ్య తలను చాలామంది పక్కనబెట్టేశారు. కరోనా నిబంధనలు పట్టిం చుకోవడం లేదు. ఇలాగే ప్రవర్తిస్తుంటే థర్డ్‌వేవ్ ముప్పు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. పండుగలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ప్రాణాలు పోతే రావు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి. ఉత్సవాల్లో తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలి. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో వేలాది మంది పాల్గొనడం సరైంది కాదు.
ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దు
రాష్ట్రంలో రాజకీయ కార్యక్రమాలు పెరిగిపోయాయి. పాదయాత్రలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు ఎక్కువయ్యాయి. ఇందులో ఎవరూ నిబంధనలు పాటించడం లేదు. రాజకీయ నేతలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతగా వ్యవహరిస్తే, ప్రజలు కూడా వారి బాటలో నడిచే అవకాశం ఉంటుంది.
రోజుకు లక్షన్నరకు పైగా టెస్టులు
ఫీవర్ (జ్వర) సర్వేలో భాగంగా కోటి ఇళ్లను ఐదారు సార్లు జల్లెడ పట్టాం. దీంతో పాజిటివ్ రేటు, మరణాలు తక్కువగా ఉన్నాయి. రోజుకు లక్షన్నరకు పైగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నాం. వ్యాక్సి న్ వేయించుకోని వారు జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో అర్హులైన టీకా లబ్ధిదారుల్లో 50 శాతం మందికి ఒక్క డోసుతో పాక్షిక రక్షణ కల్పించాం. రెండో డోసుతో సుమారు 30 శాతం మందికి రక్షణ లభించింది. మిగిలిన వారికి కూడా అందించడానికి సుమారు రెండు మూడు నెలలు పట్టే అవ కాశముంది. తగినన్ని వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభు త్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రస్తుతం మరో 4.5 లక్షల డోసులు వస్తున్నాయి. సెకండ్ డోసు పొందాల్సిన వారు 30 లక్షల మంది ఉన్నా రన్నారు. వచ్చే 4.5 లక్షల డోసుల్లో సెకండ్ డోసు వారికి ప్రాధాన్యత ఇస్తాం. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకల్లో చేరికలు పెరగడం లేదు. ప్రభుత్వంలో 14 శాతం, ప్రైవేట్‌లో 4 శాతం మాత్రమే చేరికలు ఉన్నాయి..’ అని శ్రీనివాసరావు వివరించారు.