సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థలపై ఆర్టీజన్ల సమ్మె ప్రభావం లేదని, విద్యుత్ సరఫరాలో సైతం ఎలాంటి అంతరాయాలు లేవని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లో 100 శాతం, సరఫరా (ట్రాన్స్‌కో), పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో 80 శాతం మంది ఆర్టీజన్లు మంగళవారం విధులకు హాజరయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు.
మంగళవారం నుంచి ఆర్టిజన్ల (విద్యుత్ సంస్థల్లో విలీనమైన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు) సమ్మెకి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం (హెచ్ 82) పిలుపునిచ్చి న నేపథ్యంలో దాని ప్రభావాన్ని అంచనా వేసేందుకు విద్యుత్ సౌధలో ఆయన సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని, దీనిని ఉల్లంఘించి సమ్మెకి దిగితే ఆర్టీజన్ల సర్వీసు నిబంధనలైన ‘స్టాండింగ్ ఆర్డర్స్’లోని నిబంధన 34(20) ప్రకారం దు్రష్పవర్తనగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చట్టవిరుద్ధంగా సమ్మెకి దిగిన 200 మంది ఆర్టీజన్లను ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల నుంచి తొలగించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే దుశ్చర్యలను ఉపేక్షించబోమని, ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు. బుధవారం ఉదయంలోగా విధులకు హాజరుకాని వారందర్నీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.
యూనియన్ నేతలు డిస్మిస్..
సమ్మె పిలుపు నేపథ్యంలో ఉద్యోగుల సంఘం (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు, నేతలు నరేష్, సత్యనారాయణ, వినోద్, సుభా‹Ùలను సోమవారం పంజాగుట్ట పోలీసులు ఎస్మా చట్టం కింద అరెస్టు చేయగా, మంగళవారం కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నేతలు బాల్‌రెడ్డి, కావలి వెంకటేశ్వర్లును సైఫాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారని యూనియన్ నేతలు వెల్లడించారు.
సమ్మెలో పాల్గొనడం, ఉద్యోగులను సమ్మెకి పురిగొల్పారనే ఆరోపణలపై ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి సాయిలును ఆర్టీజన్ గ్రేడ్–2 ఉద్యోగం నుంచి తొలగిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అరోపణలపై యూనియన్ హెల్త్ సెక్రటరీ జె.శివశంకర్‌ను ఆర్టీజన్ గ్రేడ్–1 ఉద్యోగం నుంచి తొలగిస్తూ టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది.
మరి కొంతమంది యూనియన్ నేతలను కూడా ఉద్యోగాల నుంచి తొలగించినట్టు సమాచారం. కాగా, ట్రాన్స్‌కోలో 80 శాతంమంది, జెన్‌కో, డిస్కంలలో కలిసి 60 శాతం ఆర్టీజన్లు సమ్మెలో పాల్గొన్నారని సాయిలు ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం మరింత మంది సమ్మెకి దిగుతార చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment