మద్దిమడుగు వెళ్తున్న ఏఎన్‌ఎం జ్ఞానేశ్వరి
మహాముత్తారం: ఆ ప్రాంతానికి వెళ్లేందుకు రహదారి లేదు. కాలినడకన వెళ్లడం కూడా కష్టమే. కారడివిలో ఎటునుంచి ఏ జంతువు మీద పడుతుందో కూడా తెలియదు. అయినా ఇవేమీ ఆమె విధి నిర్వహణకు అడ్డంకి కాలేదు. ఓ మహిళా ఏఎన్‌ఎం కాలినడకన పది కిలోమీటర్లు వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేసి శ్రమ కన్నా విధులే మిన్న అని నిరూపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని రేగులగూడెంలో రెండో ఏఎన్‌ఎంగా జ్ఞానేశ్వరి విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆదివారం పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా, మిగిలిన పిల్లలను గుర్తించి చుక్కల మందు వేసేందుకు మంగళవారం జ్ఞానేశ్వరికి విధులు అప్పగించారు. ఈ మేరకు మద్దిమడుగు ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా, భర్తసహా ఎవరూ అందుబాటులో లేరు. దీంతో ఆమె ఒక్కరే కాలినడకన మద్దిమడుగు వెళ్లి అక్కడ మిగిలిపోయిన 35 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆలోగా పని ముగించుకుని వచ్చిన భర్త ఆమెను ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరిని వైద్య సిబ్బందితో పాటు గ్రామస్తులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment