సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ వైరస్‌తో సమానంగా..దాన్ని ఎదుర్కొనే యాంటీ బాడీస్ సైతం యమస్పీడ్‌గానే వృద్ధి చెందుతున్నాయని ప్రముఖ ల్యాబొరేటరీ థైరోకేర్ వెల్లడించింది. ఇరవై రోజుల పాటు 65 నగరాల్లో నిర్వహించిన యాంటీ బాడీ టెస్టుల్లో మహారాష్ట్రలోని భివాండీ ఫస్ట్‌ప్లేస్‌లో ఉండగా, బెంగళూరు పీన్యా దసరహళ్లి సెకండ్‌ప్లేస్, ఢిల్లీలోని ఆనంద్ విహార్ థర్డ్, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నాల్గో ప్లేస్‌లో నిలిచాయి. థైరోకేర్ ల్యాబ్ ఎండీ డాక్టర్ వేలుమణి వెల్లడించిన వివరాల మేరకు...థైరోకేర్ ల్యాబ్ కంపెనీలతో పాటు వ్యక్తులకూ యాంటీ బాడీ టెస్టులు నిర్వహిస్తోంది. ఎలిసా, క్లియా కిట్స్‌ను ఈ టెస్టుల కోసం వినియోగిస్తోంది. గత నెల 23 నుంచి ఈ నెల 19 వరకు. దేశవ్యాప్తంగా 65 నగరాల్లో తమ థైరో కేర్‌ల్యాబ్ 74,809 యాంటీ బాడీ టెస్టులు నిర్వహించిందన్నారు. వీటిలో 60 వేల టెస్టుల ఫలితాలను ఆయన విశ్లేషించారు. ఈ శాంపిల్స్ ద్వారా పాజిటివిటీ రేట్ 17.5 శాతంగా ఉందన్నారు. అంటే 13,036 యాంటీ బాడీస్ టెస్టులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయన్నారు.
పరీక్షలు చేశారిలా ..
అయితే ఇదేమీ ప్రణాళికా బద్ధంగా చేసిన స్టడీ కాదని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ పరీక్షల కోసం తాము ఉన్నత స్థాయి వర్గాలు, వైట్ కాలర్ ఉద్యోగులనే ఎక్కువగా ఎంచుకున్నట్టు తెలిపారు. దిగువ స్థాయి వర్గాలు దాదాపుగా లేనే లేవన్నారు. ఈ డేటాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు అందజేశామన్నారు. ఈ డేటాను విశ్లేషించాల్సిన బాధ్యత వారిదేనన్నారు.తాము ఎవరిని పరీక్షించాలో ఎంపిక చేసుకోలేదని, పరీక్ష కోరుకున్నవారినే పరీక్షించామని అంటున్నారు. జూలై 30 కల్లా 1.2 లక్షల టెస్టులు నిర్వహిస్తామని తద్వారా మరింత స్పష్టమైన ఫలితాలు వెల్లడిస్తామని సంస్థ వెల్లడించింది.
దేశంలోనే టాప్ భివాండీ...
మొత్తం 600 పిన్‌కోడ్స్ వ్యాప్తంగా 20 రోజుల పాటు నారిమన్ పాయింట్ నుంచి జార్ఖండ్ దాకా నిర్వహించిన పరీక్షల డేటా ద్వారా థైరోకేర్ వేస్తున్న అంచనాల ప్రకారం దాదాపుగా 15 శాతం భారతీయులు ఇప్పటికే నోవల్ కరోనా వైరస్‌తో పోరాటానికి అవసరమైన యాంటీ బాడీస్‌ని సంతరించుకున్నారు. ఇందులో 3 శాతం ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. ఈ డేటా ప్రకారం దేశంలో ఇప్పటికే 18 కోట్ల మందిలో కరోనా వైరస్‌ను ఎదుర్కునే యాంటీ బాడీస్ వృద్ధి చెందాయి. అంటే అంత మందికి కరోనా సోకింది. ఇక ఈ డేటా ప్రకారం అత్యధిక పాజిటివిటీ ఉన్న ప్రాంతం థానేలోని భివాండీ. ఇక్కడ 47.1 శాతం పాజిటివిటీ నమోదైంది. బెంగుళూర్‌లోని పీన్యా దసరహల్లి ప్రాంతం 44 శాతంతో రెండవ స్థానంలో ఉంది. ఇక 37.7 శాతంతో ఢిల్లీలోని ఆనంద్‌విహార్ ఈ జాబితాలో మూడో స్థానం దక్కించుకుంది. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ ఏరియా 37.3 శాతంతో నాల్గో స్థానంలో నిలిచింది. 0.7 శాతంతో అత్యల్ప పాజిటివ్ రేట్ ఉన్న ప్రాంతంగా మహారాష్ట్రలోని అలీభాగ్ ఏరియా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.
యాంటీబాడీస్...టూ పాజిటివ్...
ఈ యాంటీ బాడీ టెస్టులు ద్వారా పాజిటివ్‌గా నిర్ధారణ అవడం అంటే.. అప్పటికే టెస్టు చేయడానికి 15 నుంచి 21 రోజులకు ముందే ఆ వ్యక్తికి వైరస్ సోకినట్టు అర్థమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తాము కనుగొనాల్సిన యాంటీ బాడీస్‌ను ఈ పరీక్షలు అన్వేషిస్తాయని, ఈ యాంటీ బాడీస్ వైరస్ సోకిన 14 రోజుల తర్వాత ఉత్పత్తవుతాయని వివరించారు. అయితే వీటిలో మరో రకం యాంటీబాడీస్ మాత్రం ఇన్పెక్షన్ సోకిన 7 రోజులకు ఉత్పత్తి అవుతాయన్నారు. యాంటీ బాడీస్‌ని నమోదు చేయడం అనేది కేవలం థైరోకేర్ సంస్థ మాత్రమే కాదు.. ఢిల్లీకి చెందిన సెరో సర్వే కూడా గతంలో ఈ రకమైన లెక్కింపు చేసింది. తొలిదశలో కోవిడ్ వ్యాప్తిపై ఈ సంస్థ నిర్వహించిన స్టడీలో ఢిల్లీకి చెందిన దాదాపు 23.48 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి కనిపించింది. మరో రకంగా చెప్పాలంటే అంత మంది కరోనా బారిన పడ్డారు. అయితే వీరిలో చాలా మందికి ఏ విధమైన లక్షణాలూ కనపడక పోవడం వల్ల ఈ విషయం తెలియనే తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment