సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో 50 ఏళ్లు దాటినవారు 60 లక్షల మంది ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. వారందరికీ మొదటి విడతలో వ్యాక్సిన్ వేయనుంది. ప్రాధాన్యక్రమంలో తొలుత ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది, కోవిడ్‌పై ముందు వరుసలో ఉండి పోరాడే పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఉద్యోగులకు వేస్తారు. తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడే 50 ఏళ్లలోపు వారికి కూడా మొదటి విడతలోనే టీకా వేస్తారు. ఇప్పటికే 2.67 లక్షల మంది వైద్య సిబ్బంది జాబితా తయారు చేశారు. మిగిలినవారిలో 50 ఏళ్లు పైబడినవారిని ఓటర్ జాబితా ప్రకారం గుర్తించి వ్యాక్సిన్ వేయాలని వైద్య, ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఓటర్ కార్డులపై పుట్టిన తేదీ ఉంటుంది. ఆ వివరాలతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా 50 ఏళ్లు దాటిన వారి జాబితాను తయారు చేయొచ్చని అధికారులు తెలిపారు. ఇక అనారోగ్యాలతో బాధపడే 50 ఏళ్లలోపు వారంతా కోవిన్ యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు చెప్పారు.
జిల్లాకో వ్యాక్సిన్ కేంద్రం
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తే అప్పుడు వేసేం దుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రెండ్రోజులపాటు ఎంపిక చేసిన జిల్లా వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. ప్రతీ జిల్లాలోనూ ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేంద్రం(స్టాక్ పాయిం ట్) ఏర్పాటు చేయనున్నారు. అక్కడినుంచే అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి. అలాగే జిల్లాకో వ్యాక్సిన్ వ్యాన్‌ను అన్ని రకాల సదుపాయాలతో ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. కోవిడ్ టీకా తీసుకునే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కేంద్రాలకు రావాల్సిందేనని వైద్య,ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అలా రాలేని వృద్ధులు, మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులను టీకా కేంద్రాలకు తీసుకువచ్చే బాధ్యతను ఇతర శాఖలకు అప్పగించారు. వైద్య, ఆరోగ్యశాఖకు 20 ఇతర శాఖలు దీంట్లో సహకరిస్తాయి.
ఒక్క రోజులోనే వైద్య సిబ్బంది అందరికీ...
వ్యాక్సినేషన్ ప్రారంభమైన మొదటి రోజే 8 గంటల్లో 2.67 లక్షల మంది వైద్య సిబ్బందికి టీకా వేస్తారు. అందుకోసం మూడు వేల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి కూడా వారి వద్దకే వెళ్లి ప్రభుత్వ సిబ్బందే టీకాలు వేయనున్నారు. తామే టీకా వేసుకుంటామని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కోరినా ఒప్పుకోబోమని వైద్యాధికారులు స్పష్టం చేశారు. వారి భాగస్వామ్యాన్ని టీకా కార్యక్రమంలో తీసుకునే ప్రసక్తే లేదన్నారు. దానివల్ల దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు.
కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు
కోవిడ్ టీకా వేసేందుకు 50 వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కేంద్రాల్లో టీకాలిస్తాం. ఆ కేంద్రాలెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇప్పుడు కసరత్తు చేస్తున్నాం. వైద్య సిబ్బందికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే టీకాలు వేస్తారు. ఇక ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సివుంది. ఇందుకు పాఠశాలలు, కమ్యూనిటీ కేం ద్రాలు, పంచాయతీ ఆఫీస్‌లను ఎంపిక చేస్తాం. టీకా ఎప్పుడు వచ్చినా వేసేందుకు జనవరి ఒకటి నాటికి సన్నద్ధంగా ఉంటాం.
– డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment