సాక్షి, హైదరాబాద్: వరుసగా జరుగుతున్న భారీ అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అగ్ని మాపక శాఖ అప్రమత్తమైంది. బహుళ అంతస్తుల భవనాలు, చాలా ఏళ్ల క్రితం నిర్మించిన వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణపై అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ప్రమాదం జరిగితే ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లే అవకాశాలు ఇలాంటి చోట్లలోనే ఎక్కువగా ఉండటంతో ఈ తరహా భవన సముదాయాల్లో ఉండే వారికి అవగాహన పెంచడమే లక్ష్యంగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు అగ్ని మాపక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి శుక్రవారం ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటే ఎలా జాగ్రత్తపడాలన్న అంశాలపై ఈ శిబిరాల్లో వివరిస్తున్నట్టు వివరించారు. అలాగే అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయకూడదన్న విషయాలు కూడా వివరిస్తున్నారు.
వాణిజ్య సముదాయాలతోపాటు పెట్రోల్ బంక్‌లు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని పాత బహుళ అంతస్తుల వాణిజ్య భవనాల్లోని దుకాణ యజమానులకు, ఆయా దుకాణాల్లో పనిచేసే వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తాజాగా స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రమైన పొగ కారణంగా లోపల చిక్కుకుపోవడం, ఆ సమయంలో ఎలా తప్పించుకోవాలో అవగాహన లేకపోవడంతోనూ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా వాణిజ్య సముదాయాల్లో పనిచేసే వారికి జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవలే అన్ని జిల్లాలతోపాటు రీజియన్‌ల ముఖ్య అగ్ని మాపక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఫైర్‌స్టేషన్ అధికారులు తమ పరిధిలోని భవనాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశంపై ఆడిటింగ్ చేయడంతోపాటు, ప్రమాదాల నియంత్రణకు జాగ్రత్తలు వివరించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment