
ఆటోలో మర్చిపోయిన నగదు బ్యాగ్‌ను పోలీసులకు అందజేస్తున్న ఆటో డ్రైవర్
సాక్షి, బంజారాహిల్స్: ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు. తన ఆటోలో ప్రయాణికుడు మర్చిపోయిన నగదు బ్యాగ్‌ను పోలీసులకు అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ధూల్‌పేటలో నివసించే రాంరాజ్ తివారీ అనే అర్చకుడు సోమవారం ఉదయం తన కూతురు వివాహానికి సంబంధించి రూ.1.25 లక్షల నగదుతో పాటు వివాహ పత్రికలను ఓ బ్యాగులో సర్దుకొని బంజారాహిల్స్‌రోడ్ నెం. 12లోని గుడిలో పూజ చేయించేందుకు షేక్‌పేటలో ఆటో ఎక్కారు. ఆటో దిగిన అర్చకుడు డబ్బులు ఉన్న బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయారు. కొద్ది దూరం వెళ్లిన ఆటో డ్రైవర్ హుస్సేన్ ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగును గమనించారు.
చదవండి: ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా’.. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్
ఆ నగదు బ్యాగ్‌ను తీసుకొని నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అదే సమయంలో ఆటోలో తన బ్యాగ్‌ను మర్చిపోయానని ఫిర్యాదు చేసేందుకు రాంరాజ్ తివారీ పోలీస్ స్టేషన్‌కు రాగా విషయం తెలిసింది. అప్పటికప్పుడే ఆ నగదు సంచిని పోలీసులు రాంరాజ్ తివారీకి ఆటో డ్రైవర్ చేతుల మీదుగా బంజారాహిల్స్ ఎస్‌ఐలు కె. ఉదయ్, అజయ్ కుమార్‌లు అప్పగించారు. ఆటో డ్రైవర్ నిజాయితీని బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ శివచంద్ర అభినందించి ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.