సెన్సార్ పనితీరును వివరిస్తున్న వాగ్దేవి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అధ్యాపకులు, ఈఈఈ విద్యార్థులు
మామునూరు: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఈఈఈ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పంట పొలాల్లో విద్యుత్ ప్రమాదాలను గుర్తించే సెన్సార్‌ను కనుగొని నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. విద్యుదాఘాతంతో పంటపొలాలు, వ్యవసాయ బావుల వద్ద రైతుల మరణాలను ఆపేందుకు సెన్సార్‌ను ఆవిష్కరించారు.
ప్రివెన్షన్ ఆఫ్ ఎలెక్ట్రోడ్యూషన్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ప్రెమెక్స్ అనే ప్రాజెక్ట్‌ను ఆధ్యాపకులు డాక్టర్ సదానందం, టి.వేణుగోపాల్ పర్యవేక్షణలో విద్యార్థులు ఎం.శృతి, పి.మేఘన, ఎండి సమీర్, ఎస్.అనురాగ్, జి.మధుకర్ రూపొందించారు. సహజంగా వ్యవసాయ బావులు, పంట పొలాల వద్ద విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుదాఘాతానికి గురై రైతులు ప్రాణాలను పోగొట్టుకుంటుంటారు.
విద్యుదాఘాతం సంభవించే అవకాశం ఉందని రైతును అలర్ట్ చేసే యంత్ర పరికరాలు అందుబాటులో లేవు. దీంతో విద్యార్థులు తమ పరిశోధన ద్వారా ప్రమాద సమయంలో అలర్ట్ చేసే సెన్సార్ పరికరాన్ని కనుగొన్నారు. శుక్రవారం సాయంత్రం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యంత్ర పని విధానాన్ని విద్యార్థులు వెల్లడించారు. ’’ప్రాసెసర్ ద్వారా సెన్సార్ స్విచ్ పరికరాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తారు.
దీంతో తెగిపడిన విద్యుత్ వైర్ల వద్దకు రైతు వస్తుంటే సెన్సార్ స్విచ్ ఒత్తిడితో ఈ యంత్రంలో అమర్చిన కెమెరా ఫొటోలు తీసి వాటిని దానంతట అదే మెమరీ కార్డులో రికార్డు చేస్తుంది. తద్వారా రైతును అప్రమత్తత చేయడమే కాకుండా బజర్ సౌండ్ ఇస్తుంది’’అని వివరించారు. ఒకవేళ రైతు ముందుకు వస్తే విద్యుత్ సరఫరా నేరుగా నిలిపివేయబడుతుందని చెప్పారు. పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేసినట్లు విద్యార్థులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment