B tech students
-
ఉద్యోగం రావడం లేదని.. బీటెక్ విద్యార్థి తీవ్ర నిర్ణయం..
సంగారెడ్డి: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం దొరకడం లేదు.. తోటి స్నేహితులు ఉద్యోగం చేస్తున్నారని మనస్తాపం చెందిన యువకుడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈసంఘటన మండల పరిధిలోని విఠలాపూర్‌లో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడ్ల వెంకటలక్ష్మి, లక్ష్మారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు వ్యవసాయం చేస్తూ కుమారులను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, చిన్నకుమారుడు ఉపేందర్‌రెడ్డి (25) బీటెక్ పూర్తి చేశాడు. ఏడాదిగా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు. ఉద్యోగం రాకపోవడం.. తోటి స్నేహితులు ఉద్యోగం చేస్తున్నారని సన్నిహితులతో చెబుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న తన మేనమామ తిరుపతిరెడ్డి వ్యవసాయ బావి వద్ద మోటారు మరమ్మతుల కోసం ఆయనతో కలిసి వెళ్లాడు. పని ముగించుకొని తిరుపతిరెడ్డి ఇంటికి రాగా.. ఉపేందర్‌రెడ్డి రాత్రి వరకు ఇంటికి రాలేదు. దీంతో రాత్రి తన మామ వాళ్ల ఇంట్లోనే ఉన్నాడని కుటుంబీకులు భావించారు. బుధవారం ఉదయం తిరుపతిరెడ్డి వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా గట్టుపైన ఉపేందర్ సెల్‌ఫోన్, డ్రెస్ ఉండడంతో కుటుంబీకులకు సమాచారం అందించాడు. బావిలో వెతకగా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుభాశ్‌గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. -
విద్యుత్ షాక్ మరణాలను ఆపే సెన్సార్
మామునూరు: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఈఈఈ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పంట పొలాల్లో విద్యుత్ ప్రమాదాలను గుర్తించే సెన్సార్‌ను కనుగొని నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. విద్యుదాఘాతంతో పంటపొలాలు, వ్యవసాయ బావుల వద్ద రైతుల మరణాలను ఆపేందుకు సెన్సార్‌ను ఆవిష్కరించారు. ప్రివెన్షన్ ఆఫ్ ఎలెక్ట్రోడ్యూషన్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ప్రెమెక్స్ అనే ప్రాజెక్ట్‌ను ఆధ్యాపకులు డాక్టర్ సదానందం, టి.వేణుగోపాల్ పర్యవేక్షణలో విద్యార్థులు ఎం.శృతి, పి.మేఘన, ఎండి సమీర్, ఎస్.అనురాగ్, జి.మధుకర్ రూపొందించారు. సహజంగా వ్యవసాయ బావులు, పంట పొలాల వద్ద విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుదాఘాతానికి గురై రైతులు ప్రాణాలను పోగొట్టుకుంటుంటారు. విద్యుదాఘాతం సంభవించే అవకాశం ఉందని రైతును అలర్ట్ చేసే యంత్ర పరికరాలు అందుబాటులో లేవు. దీంతో విద్యార్థులు తమ పరిశోధన ద్వారా ప్రమాద సమయంలో అలర్ట్ చేసే సెన్సార్ పరికరాన్ని కనుగొన్నారు. శుక్రవారం సాయంత్రం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యంత్ర పని విధానాన్ని విద్యార్థులు వెల్లడించారు. ’’ప్రాసెసర్ ద్వారా సెన్సార్ స్విచ్ పరికరాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తారు. దీంతో తెగిపడిన విద్యుత్ వైర్ల వద్దకు రైతు వస్తుంటే సెన్సార్ స్విచ్ ఒత్తిడితో ఈ యంత్రంలో అమర్చిన కెమెరా ఫొటోలు తీసి వాటిని దానంతట అదే మెమరీ కార్డులో రికార్డు చేస్తుంది. తద్వారా రైతును అప్రమత్తత చేయడమే కాకుండా బజర్ సౌండ్ ఇస్తుంది’’అని వివరించారు. ఒకవేళ రైతు ముందుకు వస్తే విద్యుత్ సరఫరా నేరుగా నిలిపివేయబడుతుందని చెప్పారు. పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. -
గచ్చిబౌలి: మద్యం మత్తులో వీరంగం.. పోలీసులపై చిందులు తొక్కిన యువకులు
సాక్షి, గచ్చిబౌలి: మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికాలో ఇంజనీరింగ్ చదివి ఇటీవలే నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును డ్రైవ్ చేస్తూ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడమే కాకుండా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసుల పై చిందులు వేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేటకు చెందిన కే.విజయ్(30), ఘట్కేసర్కు చెందిన సూర్య(28)లు గురువారం సాయంత్రం విధులు ముగించుకొని కొండాపూర్ ప్రాంతానికి వచ్చారు. కారు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ విజయ్, సూర్యలను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్దరు యువకులు నిహాల్, లోహిత్‌లుగా గుర్తించారు. మత్తులో ఉన్న వీరు పోలీసులపై తిరగబడడంతో వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటకు చెందిన లోహిత్, కొండాపూర్‌కు చెందిన నిహాల్‌రెడ్డి ఇద్దరు స్నేహితులుగా గుర్తించారు. అమెరికాలో వీరిద్దరు బీటెక్ పూర్తి చేసి ఇటీవలే నగరానికి వచ్చారు. కాగా వీరు ఇరువురు గురువారం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగి సాయంత్రం కొండాపూర్‌లోని నిహాల్ ఇంటికి వస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి వీరి ముందు బైక్‌పై వెళ్తున్న విజయ్, సూర్యల వాహనాన్ని ఢీకొట్టారు. వీరికి డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేయగా కారు నడుపుతున్న నిహాల్‌కు 234 ఎంజీ, లోహిత్‌కు 501ఎంజీ వచ్చింది. వీరు మద్యంతోపాటు మత్తు పదార్థాలను తీసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై పార్లమెంటు సభ్యుడి స్టిక్కర్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
2000 మందికి సున్నా మార్కులు.. నోరెళ్లబెట్టిన విద్యార్థులు, కారణమేంటి?
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 2 వేల మంది విద్యార్థులకు కొన్ని పేపర్లలో సున్నా మార్కులు రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగగా.. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ 2, 3 సంవత్సరాల విద్యార్థుల ఆఖరి సెమిస్టర్ మార్కులను ఇటీవల ప్రకటించారు. ఈ ఫలితాల్లో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల్లో జీరో మార్కులు వచ్చాయి. వీరిలో ఎక్కువమంది పాలిటెక్నిక్ డిప్లొమా చేసి, ఐసెట్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ రెండో ఏడాది ప్రవేశాలు పొందిన వాళ్లు కావడం గమనార్హం. ఇంటర్నల్ పరీక్షల్లో వీరిలో చాలామందికి 25కు గాను 23 వరకు మార్కులొచ్చాయి. అయితే ఎక్స్టర్నల్స్లో మాత్రం ఏకంగా జీరో రావడం విస్మయం కలిగిస్తోంది. ఈ విధంగా మార్కులొచ్చిన వారు ఇప్పటివరకు 2 వేల మందిని గుర్తించినట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. అన్ని కాలేజీల నుంచి డేటా తెప్పిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం దశలోనో, మార్కుల వెల్లడిలోనో జరిగిన సాంకేతిక లోపం ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: దీపం ఆరింది.. దిశగా వెలిగింది.. ‘దిశ’ విషాదానికి నేటితో రెండేళ్లు ) ఇప్పటికీ వినియోగంలో పాత సాఫ్ట్వేర్ కళాశాలలకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిన తర్వాత మార్కులను ఆయా కాలేజీల వారీగా జేఎన్టీయూహెచ్ సాఫ్ట్‌వేర్‌లో ఆప్‌లోడ్ చేస్తారు. దీనికోసం వర్సిటీ ఇప్పటికీ ఎప్పుడో పాతకాలం నాటి సాఫ్ట్‌వేర్‌నే వాడుతోంది. ఆప్‌లోడ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని తప్పుగా గుర్తించే విధానం ఈ సాఫ్ట్‌వేర్‌లో లేదని, తప్పులు ఆటోమేటిక్‌గా గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను వర్సిటీ ఇప్పటికీ అందిపుచ్చుకోలేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు అధ్యాపకులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో జరిగిన పరీక్షలకు దాదాపు రెండు లక్షల వరకు విద్యార్థులు హాజరయ్యారు. అయితే అతి తక్కువ మందితో వాల్యుయేషన్ చేయించడం, వేగంగా మార్కులు అప్లోడ్ చేయించడం జరిగిందని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు జీరో మార్కులు రావడానికి ఇవన్నీ కారణాలై ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. జేఎన్టీయూహెచ్ అధికారులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు. (చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) సాంకేతిక సమస్యలు సరిదిద్దుతాం ఎంతమందికి జీరో మార్కులొచ్చాయో డేటా తెప్పిస్తున్నాం. సమాధాన పత్రాలు పరిశీలిస్తాం. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తాం. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే అవకాశం లేదు. సాంకేతికపరమైన సమస్యలుంటే సరిదిద్దుతాం. విద్యార్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – మంజూర్ హుస్సేన్, రిజిస్ట్రార్, జేఎన్టీయూహెచ్ అధ్యాపకులపై ఒత్తిడే కారణం.. వాల్యుయేషన్ నేపథ్యంలో అధ్యాపకులపై విపరీ తమైన ఒత్తిడి ఉంటోంది. వర్సిటీ అధికారులు త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు పరుగులు పెట్టిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ పని చేయిస్తున్నారు. వాల్యుయేషన్‌కు వెళ్లినా కాలేజీల్లో బోధన చేయాల్సి వస్తోంది. జీరో మార్కులు రావడానికి ఈ పరిస్థితులే కారణమని భావిస్తున్నాం. – అయినేని సంతోష్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, సాంకేతిక కాలేజీల ఉద్యోగుల సంఘం అప్పుడు 82 శాతం.. ఇప్పుడు జీరో ఇంటర్నల్స్‌లో నాకు 82% మార్కులొచ్చాయి. రెండో ఏడాది మ్యాథ్స్ పేపర్లో సున్నా మార్కులు వేశారు. పరీక్ష బాగానే రాశాను. అందుకే ఇదేం అన్యాయమని కాలేజీ వాళ్లను అడిగాను. జవాబు పత్రం మూల్యాంకనం చేసేది మేము కాదు యూనివర్సిటీ వాళ్లని, అక్కడకెళ్లి అడగాలని చెబుతున్నారు. – సంజయ్, విద్యార్థి, అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ అధికారులే బాధ్యత వహించాలి వర్సిటీ అధికారుల మొద్దు నిద్రకు ఇది ఓ ఉదాహరణ. ఇంటర్నల్స్‌లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన విద్యార్థులకు ప్రధాన పరీక్షలో సున్నాలు ఎలా వస్తాయి? విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడటం అన్యాయం. ఇందుకు అధికారులు బాధ్యత వహించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
Warangal: డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్ గా బుక్కైన బీటెక్ విద్యార్థులు
-
వరంగల్: బీటెక్ విద్యార్థుల వద్ద డ్రగ్స్ స్వాధీనం..
సాక్షి, వరంగల్: వరంగల్‌లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన ఇద్దరు బీటెక్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొకైన్‌తోపాటు 15 గ్రాముల చరాస్, 36 మత్తు టాబ్లెట్లు సీజ్ చేశారు. విద్యార్థుల నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విద్యార్థులు ఇతరులకు అమ్ముతున్నారని తెలిపారు. డ్రగ్స్ సేవిస్తున్న మరో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బీటెక్ విద్యార్థులు రోహన్, కాశీరావుగా పోలీసులు గుర్తించారు. చదవండి: డ్రస్సింగ్ రూంలో మహిళల న్యూడ్ వీడియోలు చిత్రీకరణ -
అక్టోబర్‌లో బీటెక్ ప్రత్యక్ష తరగతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలను వీలైనంత త్వరగా తెరిచే వీలుంది. రెండు, మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థుల తరగతులను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇది వీలుకాకపోతే అక్టోబర్ నుంచైనా ప్రత్యక్ష బోధన చేపట్టే వీలుంది. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరగా ముగించి, అక్టోబర్ మొదటి వారంలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సీఎం ఆదేశం కోసం ఎదురు చూస్తున్నామని మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఏఐసీటీఈ డెడ్‌లైన్.. అక్టోబర్ 15లోగా ఇంజనీరింగ్ కాలేజీల్లో పూర్తిస్థాయి ప్రత్యక్ష బోధన చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రాలను ఆదేశించింది. సామాజిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి సెక్షన్‌లోనూ గరిష్టంగా 60 మంది విద్యార్థులు ఉంటారు. చాలా కాలేజీల్లో బెంచ్‌కు ఇద్దరు చొప్పున కూర్చుంటున్నారు. ఇకపై ఒక్కరినే కూర్చోబెట్టడం సాధ్యమేనా అనే దిశగా పరిశీలన చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇలా చేయాల్సి వస్తే సెక్షన్లు పెంచాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేయగల సామర్థ్యం ఎన్ని కాలేజీలకు ఉందనే వివరాలను ప్రభుత్వం ముందుంచారు. అక్టోబర్ 15లోపే ఫస్టియర్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టే వారికి అక్టోబర్ 15లోగా ప్రత్యక్ష బోధన చేపట్టాలని ఏఐసీటీఈ సూచించింది. ఎంసెట్ ఫలితాలను ఈ నెల 25న వెల్లడిస్తారు. 30 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియభహ మొదలుపెడుతున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 11 మధ్య ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. ఇదే నెల 4 నుంచి 13 తేదీల మధ్య వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 15న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. జీఈఈ ఫలితాల తర్వాత తదుపరి కౌన్సెలింగ్ చేపడతారు. మొత్తమ్మీద సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 4 నాటికి సీట్ల కేటాయింపు జరపాలని, అక్టోబర్ మొదటి వారంలో కాలేజీల్లో విద్యా బోధన నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
గూగుల్ సెర్చ్ చేసి నిండా మునిగిన బీటెక్ బాబులు..
సాక్షి, హిమాయత్‌నగర్: వారంతా బీటెక్ పూర్తి చేశారు.. పేరుగాంచిన కంపెనీలో ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. గూగూల్ ఉంది కదా అని సెర్చ్ చేసి ఓ నంబర్‌ను సాధించారు. అతగాడికి ఫోన్ కలపగా..మాదాపూర్‌లో కొత్తగా ‘లిమిటెక్స్’ పేరుతో పెద్ద కంపెనీ పెట్టా. నేనే సీఈఓ. నేనే ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నా. ఆసక్తి ఉంటే రెజ్యూమ్‌లు పంపండి అని నమ్మబలికాడు. నిజమే కదా అని నమ్మిన సుమారు 35–40 మంది తమ రెజ్యూమ్‌లు పంపి మళ్లీ అతడిని ఫోన్లో కాంటాక్ట్ చేశారు. ఉద్యోగం రావాలంటే ముందుగా కొంత డబ్బు చెల్లించాలనడంతో..ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా ఒక్కొక్కరు పోస్టుకు తగ్గట్టు రూ.లక్ష, రూ.3లక్షల చొప్పున సుమారు రూ.27లక్షల 30 వేలు ఆన్లైన్ ద్వారా పంపారు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని అల్వాల్‌కు చెందిన బుచ్చిరాములు సోమవారం సైబర్‌క్రైం పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. తనలాగా ఎవరైనా బాధితులు ఉన్నారా అని గూగూల్లో సర్చ్ చేయగా..35– 40మంది బాధితులు ప్రస్తుతానికి బుచ్చిబాబును కాంటాక్ట్ చేశారు. దీంతో వీరంతా మంగళవారం నేరుగా సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. వీరితో పాటు మరింత కొంత మంది ఉండొచ్చనేది బాధితుల నుంచి వస్తున్న సమచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి సైబర్‌క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం యువకుడితో ప్రేమ.. పెళ్లి చేసుకుంటానని వెళ్లి. -
బీటెక్ దొంగలు..!
వాళ్లంతా బీ.టెక్ పూర్తి చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. మస్తుగా మందుకొట్టి, పోలీసులమంటూ దారిదోపిడీకి స్కెచ్ వేశారు. మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరిని చితకబాది నగదు, సెల్ఫోన్లు లాక్కున్నారు. మళ్లీ ఆ డబ్బుతో ఫుల్‌గా ఎంజా య్ చేశారు. ఆ మత్తు దిగేలోపు పోలీసులు వాళ్ల భరతం పట్టారు. నిందితులు దారిదోపిడీకి ఉపయోగించిన కారే చివరకు వాళ్లను పోలీసులకు పట్టించింది! చిత్తూరు, పీలేరు రూరల్ : నకిలీ పోలీసులు హల్ చల్ చేసి దోపిడీకి పాల్పడిన సంఘటన మండలంలోని వేపులబైలులో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం పీలేరు అర్బన్ సీఐ చిన పెద్దయ్య తెలిపిన వివరాలు..మదనపల్లెకు చెందిన రెడ్డిప్రసాద్, నాగేంద్ర తిరుపతిలో చిన్నపాటి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. తమ కష్టార్జితాన్ని ఇంటివద్ద ఇచ్చేందుకు ఈ నెల 24న రాత్రి ద్విచక్ర వాహనంలో తిరుపతి నుంచి మదనపల్లెకు బయల్దేరారు. మార్గమధ్యంలో వాటర్ బాటిల్ కోసం వేపులబైలు వద్ద ఆగారు. ఓ కూల్‌డ్రింక్ షాపులో వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుండగా పీలేరుకు చెందిన నిరంజన్ రెడ్డి (23), రెడ్డి శేఖర్ (22), రెడ్డి ప్రసాద్ (23) బంగారుపాళెంకు చెందిన చంద్ర (22) కారులో వచ్చారు. తాము పోలీసులమని ద్విచక్ర వాహనం రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలని వారిని హడలెత్తించారు. ఇద్దరినీ చితకబాది 10,000 రూపాయలతో పాటు 2 సెల్ఫోన్లు లాక్కున్నారు. వీరి వాలకం అంతా అనుమానాస్పదంగా ఉండడంతో బాధితులకు వీళ్లు పోలీసులు కాదని బోధపడింది. ఇదే విషయమై ప్రశ్నించేసరికి పోలీసులకు సమాచారమిస్తే అంతు చూస్తామని బెదిరించి అక్కడ నుంచి అదృశ్యమయ్యారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా బాధితులు నేరుగా మదనపల్లెకు చేరుకున్నారు. మరుసటి బాధితులు పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టించిన కారు దారిదోపిడీకి నిందితులు ఉపయోగించిన కారు కేసు ఛేదనలో కీలక ఆధారమైంది. బాధితులు అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నిందితులు ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు నంబర్ ఏపీ 27 ఏఎక్స్ 6969ను గుర్తు పెట్టుకుని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆ కారు నంబర్‌ను లాగితే ఈ దోపిడీ డొంకంతా కదిలింది. నిందితులు అప్పటికింకా పీలేరులోనే ఉన్నారు. బాధితుల నుంచి లాక్కున్న డబ్బుతో మళ్లీ జల్సా చేశారు. కారుతో సహా అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దోపిడీ సొత్తును రికవరీ చేశారు. శుక్రవారం సాయంత్రం కోర్టుకు హాజరు పరిచారు. అందరూ బాల్య స్నేహితులే..ఒకరిపై ఆరు కేసులు నిందితులు నలుగురూ బాల్యస్నేహితులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. అందరూ బీ.టెక్ పూర్తి చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. వీరిలో నిరంజన్‌రెడ్డిపై మూడు ఎర్రచందనం కేసులు, మూడు గొడవ కేసులున్నట్లు సీఐ చెప్పారు. తన సోదరికి వివాహం కాబోతోందని, అందరూ కలిసి పార్టీ చేసుకుందామని నిరంజన్ రెడ్డి ఆహ్వానం మేరకు బాల్యస్నేహితులు కలిసినట్లు తెలియవచ్చింది. దోపిడీకి కూడా స్కెచ్ వేసింది ఇతగాడేనని తేలింది. విస్తుపోయిన తల్లిదండ్రులు తమ పుత్రరత్నాల ఘనకార్యం గురించి పోలీసులు చెప్పేవరకూ తెలియకపోవడంతో నిందితుల్లో ముగ్గురి తల్లిదండ్రులు విస్తుపోయారు. పోలీస్‌స్టేషన్‌లోనే వాళ్ల చెంపలు వాయించినట్లు తెలిసింది. చేతికొచ్చిన పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టకపోతే చివరకు పోలీస్ స్టేషన్ గడప ఎక్కాల్సి వస్తుందనడానికి ఇదో ఉదాహరణ. -
బీటెక్ పట్టభద్రుల గంజాయి దందా
రాజేంద్రనగర్: జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు బీటెక్ పట్టభద్రులు సంపాదన కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి వివిధ మార్గాల ద్వారా గంజాయిని సేకరించి నగరంలోవిక్రయిస్తూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కె.అఖిల్, ఎస్.కె.నయీం, టి.భానుతేజ ముగ్గురూ స్నేహితులు. బీటెక్ పూర్తి చేసిన వీరు ఉద్యోగ అన్వేషణలో భాగంగా నగరానికి వచ్చి మణికొండ ప్రాంతంలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు అందుకు అవసరమైన డబ్బులు సంపాదించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఈ నేపథ్యంలో గంజాయికి డిమాండ్ ఉన్నట్లు గుర్తించారు. స్వయంగా విశాఖ జిల్లా, అరకు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి గంజాయిని కోనుగోలు చేశారు. ఈ సందర్భంగా వారికి పలువురు గంజాయి విక్రేతలతో పరిచయం ఏర్పడింది. దీనిని ఆసరాగా తీసుకుని గత మూడు నెలలుగా గంజాయిని తెప్పించి వాటిని ప్యాకెట్ల రూపంలో విద్యార్థులు, అడ్డా కూలీలు తదితరులకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు గురువారం మణికొండ ప్రాంతంలో కాపు కాశారు. రోడ్ నెంబర్ 5 మీదుగా వెళుతున్న అఖిల్, నయీంలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వీరు ఉంటున్న గదిలో తనిఖీలు చేసి విక్రయానికి సిద్దంగా ఉన్న తొమ్మిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను పసిగట్టిన భానుతేజ పరారైనట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. దాడిలో సీఐ శ్రీధర్, ఎస్సై కురుమానాయకులు, కానిస్టేబుళ్లు సుధాకర్, కృష్ణారావు, రవికుమార్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
పుంగనూరు : పట్టణ పరిధిలోని పలమనేరు రోడ్డులో ఉన్న సుబ్బమ్మ చెరువులో ఓ యువతి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. సీఐ సాయినాథ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. బజారు వీధిలో కాపురముంటున్న శివలింగప్ప కుమార్తె భవాని (20) మదనపల్లె సమీపంలోని ఓ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. మంగళవారం రాత్రి తల్లి దండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది 8.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఎంత వెతికినా ఆచూకీ కనిపించలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుబ్మమ్మ చెరువులో ఎవరిదో మృతదేహం తేలివుందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే తమ కూతురు కనిపించలేదని పోలీసు స్టేషన్‌కు శివలింగప్ప వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు మృతురాలి ఫొటో చూపించగా తన కుమార్తె అని గుర్తించడం జరిగిందన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అవ్వా కావాలి..బువ్వా కావాలి
నేటి యువత పొద్దుపొద్దున్నే కాఫీకి నో చెబుతూ గ్రీన్ టీకి గుడ్ మార్నింగ్ పలుకుతున్నారు. ఒక వైపు సంప్రదాయ రైస్‌ను తీసుకుంటూనే వైట్ రైస్, మంచూరియా, నూడుల్స్ వంటి జంక్ ఫుడ్లపైనా మోజు పెంచుకుంటున్నారు. మరో వైపు హ్యాండ్ వాషింగ్, బ్రాండెడ్ టూత్ పేస్ట్, బ్రష్‌లకు ఓటేస్తూ పరిశుభ్రతకు అగ్ర తాంబూలమిస్తున్నారు. ఇంకో వైపు మగువల హ్యాండ్ బ్యాగుల వెంట తిరిగే ఫేస్ వాష్, బాడీ లోషన్ వంటి సౌందర్య సాధనాలనూ.. మగమహారాజులు తమ పాకెట్లలో పదిలంగా దాచుకుంటున్నారు. ఇటీవల తెనాలి విద్యార్థినుల సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సాక్షి, తెనాలి: విద్యార్థులకు నేటి సమాజం గురించిన అవగాహన, చుట్టూ ఏం జరుగుతోందన్న స్పృహను కలిగి ఉండటం అవసరం. ఇందుకు ప్రత్యేకించి తరగతులు లేకున్నా, సొంతగా కాస్తంత ఆసక్తి, తగిన ప్రోత్సాహం ఉంటే అవకాశాలు అవే వస్తాయి. పాఠ్యాంశాల్లోనే కాకుండా సామాజికాంశాల్లోనూ తొంగి చూడొచ్చు. అబ్బుపరచే అనేక విశేషాలు తెలుసుకోవచ్చు. వాటిని పది మందికీ అందుబాటులోకి తేవచ్చు. ఈ తరహా పరిజ్ఞానం జ్ఞానాభివృద్ధికే కాదు, పోటీపరీక్షలు, ఇంటర్వ్యూల్లో వ్యక్తిగత విజయాల సాధనకు తోడ్పడుతుంది. స్థానిక ఏఎస్ఎన్ మహిళా ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థినులు తాజాగా చేసిన సామాజిక సర్వే ఈ కోవలోకే వస్తుంది. 41 అంశాలపై సర్వే రోజూ నిద్ర లేచాక బ్రష్ చేయటం నుంచి, భోజనం చేసేవరకు దైనందిన జీవితంలో మనం కాఫీ, టీ, శీతల పానీయాలు, కాస్మటిక్స్, ఆహార పధార్ధాలను వినియోగిస్తుంటాం. ఇందులో రకరకాలుంటాయి. మారుతున్న జీవనశైలి, సంబంధిత వ్యాధులు, తినే ఆహారపదార్ధాలపై ప్రభావం చూపుతోందా? అనే అంశాలను సర్వేతో తెలుసుకోవాలని కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ ఫైనలియర్లో ఉన్న కీర్తి శివపార్వతి, తనూజ చెరుకూరి, మంజూషలు ఉత్సుకత చూపారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో భాగమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా చేయాలని తలపెట్టారు. ఇందుకు డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్‌చంద్ ప్రోత్సాహం లభించింది. ఇంటిల్లపాదీ వాడే టూత్ పేస్ట్ నుంచి నిత్యం ఉపయోగించే వినిమయ వస్తువులు, ఆహార పదార్థాల వరకు 41 అంశాలపై సర్వే చేశారు. ఒక్కో అంశానికి మల్టిపుల్ చాయిస్లో సమాధానాలు సేకరించారు.. ఇతరమైనవి అనే చాయిస్‌కు అవకాశం కల్పించారు. రెండు నెలల క్రితం చేపట్టిన ఈ సర్వేలో భాగంగా వెయ్యి మంది అభిప్రాయాలను తీసుకున్నారు. అధునికతతోపాటు వదలని సంప్రదాయం... ఈ వివరాలతో క్రోడీకరించిన నివేదిక ఆధునికతను అందిపుచ్చుకుంటున్న వైనం స్పష్టమవుతోంది. జీవనశైలి వ్యాధులు సతమతం చేస్తున్నప్పటికీ ఆహారపు అలవాట్లలో మార్పులురాని వైనాన్నీ బహిర్గతం చేసింది. సెలబ్రిటీలు ప్రచారం చేసే ఉత్పత్తులపై వ్యామోహమూ తేటతెల్లమైంది. ఉదాహరణకు ఆహారంలో బియ్యం వినియోగం తగ్గించాలనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్నా, 99.8 శాతం ప్రధాన ఆహారం బియ్యం కావటం ఇందుకో నిదర్శనం. ఇందులో తెల్లబియ్యాన్ని 85 శాతం వినియోగిస్తున్నారు. మరో వైపు ఫాస్ట్ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. మంచూరియా, నూడుల్స్, బర్గర్స్కు ఎక్కువ రేటింగ్ వచ్చింది. అన్నింటికంటే మంచూరియా, తర్వాత స్థానంలో నూడుల్స్ ఉండటం గమనార్హం. శక్తినిచ్చే పానీయాల వినియోగం 93.4 శాతం ఉందట. ఆరోగ్యకరమైన తేనీరు స్థానంలో గ్రీన్ టీ వినియోగం పెరగటం మంచి మార్పు. హ్యాండ్‌వాష్‌కు ప్రాధాన్యనిస్తుండటం మరో శుభపరిణామం. టూత్ బ్రష్, టూత్ పేస్ట్‌తో సహా పలు వస్తువుల వినియోగంలో బ్రాండెడ్పైనే ఆదరణ చూపుతున్నారు. సౌందర్య సాధనకు మెరుగులు... వ్యక్తిగత పరిశుభ్రత, సౌందర్య సాధనకు ప్రాధాన్యత పెరగటం మరో కీలకాంశం. యువత/మహిళల్లో పెర్ఫ్యూమ్స్ వాడకం 88 శాతం ఉండగా, పెదవుల రక్షణ క్రీముల వినియోగం 92.6 శాతంగా కనిపించింది. మగవారూ ఇందుకు తీసిపోలేదు సుమా! ఒక విధంగా వారిని మించిపోయారు. బాడీ లోషన్స్‌ను 94.6 శాతం, ముఖం శుభ్రం చేసుకొనే లోషన్స్‌ను 90.2 శాతం వాడుతుండగా మొత్తంగా 94.8 శాతం యువత/మగవారు పెర్ఫ్యూమ్స్ను వినియోగిస్తున్నట్టు తమ సర్వేలో తేలిందని శివపార్వతి, తనూజ చెప్పారు. ప్రాజెక్టు రిపోర్టులో భాగంగా ఈ నివేదికను యూనివర్సిటీకి సమర్పించారు. ప్రత్యేకంగా వెబ్సైట్లో పొందుపరచి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ, మార్పులను అధ్యయనం చేయనున్నట్టు మంజూష చెప్పారు. సెకండియర్‌లో తామంతా ఆన్లైన్ సినిమా టికెట్లపై ప్రాజెక్టును రూపొందించినట్టు వెల్లడించారు. వాస్తవాల అధ్యయనంతో మార్పు ఇంజినీరింగ్‌లో ప్రాజెక్టులు కీలకమని తెలి సిందే. చిత్తశుద్ధితో నిజా యితీగా చేసే విద్యార్థులకు జాబ్ స్కిల్స్ అలవడతాయి. జీవితంలో విజేతలవుతారు. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసినప్పుడు ఏవైనా సమస్యలు దృష్టికి వస్తే సాఫ్ట్వేర్ ద్వారా పరిష్కారాన్ని కనుగొనే అవకాశముంటుంది. ఇలాంటి సర్వేలను ఎంకరేజ్ చేసి స్టార్టప్ స్థాయికి తీసుకెళ్లాలనేది లక్ష్యం. - కొలసాని రామ్‌చంద్, ప్రిన్సిపాల్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ -
నలుగురు దొంగల్ని అరెస్ట్ చేసిన అనంత పోలీసులు
అనంతపురం: పలుదొంగతనాల కేసులో నిందితులుగా ఉన్న నలుగుర్ని గురువారం అనంతపురం రెండో పట్టణ పోలీసులు బళ్లారి రోడ్డు వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి 4 తులాల బంగారం, 8 మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి వీరు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నట్లు తెలిసింది. నిందితులు పెద్దన్న , దివాకర్, మహేశ్‌లను నాగముణీంద్రలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
నలుగురు ఈవ్ టీజర్లకు రిమాండ్
కొత్తూరు(మహబూబ్‌నగర్): విద్యార్థినుల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన లారీ డ్రైవర్లు రాము(24), చెన్నయ్య(22), బీటెక్ విద్యార్థులు మహేష్(22), రాకేష్(21) ఉదయం గ్రామంలోని బస్టాప్ వద్ద నిలబడి... విద్యార్థినులు, యువతులను చూసుకుంటూ తమ సెల్ఫోన్లలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న షీ టీం సభ్యులు సుమారు అర్థగంట పాటు గమనించారు. మాటలతో ఆగకుండా వారి అగడాలు మితిమీరడంతో నలుగురినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిని షాద్‌నగర్ కోర్టులో హాజరుపరుచనున్నట్లు సీఐ గంగాధర్ వెల్లడించారు. -
హోలీ ఆడుతుండగా.. లారీ ఢీ; ఇద్దరికి గాయాలు
రంగారెడ్డి: హోలీ వేడుకల్లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని రాంపల్లిలో హోలీ ఆడుతున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
డివైడర్‌ను ఢీకొన్న బైక్: బీటెక్ విద్యార్థులు మృతి
వరంగల్: వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద డివైడర్‌ను ఆదివారం బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యువకులు మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు బీటెక్ చదువుతున్నారని పోలీసులు తెలిపారు. విద్యార్థుల మృతి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.