గన్‌ఫౌండ్రీ: అప్పుడే పుట్టిన పిల్లలు తారుమారైన ఘటనలు అప్పుడప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం. ఇదే తరహా ఘటన నిలోఫర్ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హబీబ్ నగర్‌కు చెందిన మహ్మద్ జాఫర్ తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో బుధవారం రాత్రి నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించాడు. గురువారం మధ్యాహ్నం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అదే సమయంలో అబ్దుల్ బాసిద్ అనే వ్యక్తి భార్య సైతం ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో అబ్దుల్ జాఫర్‌కు చెందిన చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వార్డు బాయ్ సూచించడంతో అతడి సోదరి ఫరీదాబేగం చిన్నారిని పరీక్షల నిమిత్తం తీసుకెళ్లింది.
పరీక్షల అనంతరం చిన్నారి రంగు, దుస్తులు మారిపోవడంతో జాఫర్ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో బాసిద్ చిన్నారిని సైతం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువచ్చారని, ఈ సమయంలో చిన్నారుల తారుమారు జరిగిందని జాఫర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు చిన్నారులకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి ఎవరి బిడ్డను వారికి అప్పగిస్తామని తెలిపారు. ( చదవండి: మిక్సీ గ్రైండర్, కటింగ్ ప్లేర్‌లో బంగారం )
Comments
Please login to add a commentAdd a comment