సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర–3 ఆగస్టు 2న యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమై, అదే నెల 26న హనుమకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగియనుంది. ఈసారి అనేక గిరిజన తండాలు, బడుగు బలహీనవర్గాల ప్రభావం ఉన్న ప్రాంతాల మీదుగా ఈ పాదయాత్రను నిర్వహించనున్నారు. శనివారం పార్టీ నేతలు టి.వీరేందర్ గౌడ్, పాల్వాయి రజనీలతో కలిసి ప్రజాసంగ్రామ యాత్ర ప్రముఖ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.జి.మనోహరెరెడ్డి ఈ యాత్ర షెడ్యూల్, రూట్‌మ్యాప్‌ను మీడియాకు విడుదల చేశారు.
24 రోజుల పాటు యాత్ర
మొత్తం 24 రోజుల పాటు ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల పరిధిలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని (భువనగిరి లోక్‌సభలో 6, వరంగల్ లోక్‌సభలో 6 స్థానాలు) 125 గ్రామాల మీదుగా 328 కి.మీ. మేర సాగనుంది. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, జనగాం, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంజయ్ పాదయాత్ర ఉంటుంది. అయితే ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా యాత్రకు విరామం ఇస్తారు. ముగింపు సందర్భంగా ఆగస్టు 26న హనుమకొండలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
పోరాట నేపథ్య ప్రాంతాల మీదుగా..
చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా సంజయ్ పాదయాత్ర సాగనుండడం విశేషం. కాగా చేనేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి, రజాకార్ల అరాచకాలకు మూకుమ్మడిగా బలైన గుండ్రాంపల్లి, చాకలి ఐలమ్మ పోరు సాగించిన విసునూరు, సర్వాయి పాపన్న పాలనా రాజధాని కిలషాపూర్, తెలంగాణ సాయుధ పోరాట చైతన్య వేదిక కొత్తపేటతో పాటు ఐనవోలు మల్లన్న ఆలయ ప్రదేశాల మీదుగా ఈ యాత్ర కొనసాగనుంది.
పార్టీలో చేరికలు
ప్రజాసంగ్రామ యాత్రకు భారీ స్పందన వస్తోందని, దీని ప్రభావం క్షేత్ర స్థాయిలో ఉందని మనోహర్‌రెడ్డి వెల్లడించారు. భారీ బహిరంగ సభతో ప్రారంభం అయ్యే యాత్ర భారీ బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. ఈ యాత్ర సందర్భంగా పార్టీలో చేరికలు ఉంటాయని తెలిపారు. ఆగస్టు 7న పోచంపల్లిలో చేనేత దినోత్సవం నిర్వహిస్తామని, పుణ్య క్షేత్రాలను సందర్శిస్తూ యాత్ర సాగుతుందని వీరేందర్ గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment