
గొడవ పడుతున్న ఇరువర్గాల నాయకులు
నాయకుల మధ్య తోపులాట జరిగింది. విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని రాయచూర్ రోడ్డుపై రెండువర్గాల వారు పిడిగుద్దులకు దిగడంతో గొడవ మరింత పెద్దదైంది...
దేవరకద్ర (మహబూబ్‌నగర్): బీజేపీకి చెందిన రెండువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు గాయపడిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు స్వాగతం పలుకుతూ బీజేపీ నాయకులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో గోడలపై రాయించారు. ఇందులో భూత్పూర్ మండలానికి చెందిన ఓ నాయకుడి పేరును ప్రధానంగా ప్రస్తావిస్తు రాశారు.
ఎవరి పేర్లు రాయవద్దని ముందుగానే సూచించినప్పటికీ ఎందుకు రాశారని దేవరకద్ర నాయకులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో దేవరకద్ర, భూత్పూర్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని రాయచూర్ రోడ్డుపై రెండువర్గాల వారు పిడిగుద్దులకు దిగడంతో గొడవ మరింత పెద్దదైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అదుపు చేశారు.
చదవండి👉 వారసులొస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అంటూ..
గాయపడ్డ బాల్‌రెడ్డి
అనంతరం గొడవకు కారణమైన వారిని వాహనంలో ఎక్కించుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో భూత్పూర్‌కు చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి తలకు తీవ్ర గాయంకాగా.. దేవరకద్రకు చెందిన పార్టీ మండలాధ్యక్షుడు అంజన్‌కుమార్‌రెడ్డి, ఇతర కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు బాల్‌రెడ్డిని పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. జరిగిన గొడవపై ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి👉🏻 63,425 పోస్టుల్ని ఎప్పుడు భర్తీ చేస్తారు?