సుదిమళ్లలో గిరిజన రైతు భార్య నుంచి వేలం పాటకు అంగీకార పత్రం రాయించుకుంటున్న అధికారులు
ఇల్లెందు: కరోనా కష్టాల్లోంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న గిరిజన రైతులకు బ్యాంక్ అధికారులు షాక్ ఇచ్చారు. రుణాలు చెల్లించాలంటూ కనికరంలేకుండా డెడ్‌లైన్ విధించారు. రుణం చెల్లించకపోతే తాము ఎంత దారుణంగా ప్రవర్తించదలిచామో డప్పుకొట్టించి మరీ చెప్పారు. గిరిజన రైతుల ఇళ్ల ముందు చాటింపు వేయించి వారిలో భయాందోళన కలిగించారు. ఇల్లిల్లూ జీపుల్లో తిరుగుతూ మైకుల్లో హెచ్చరించారు.
ఇంకా దారుణమేమిటంటే... ఈ నెల 18వ తేదీలోగా రుణాలు చెల్లించలేకపోతే తమ ఇళ్లలోని విలువైన వస్తువుల వేలం, ఇళ్లకు తాళం వేసుకోవచ్చని గిరిజన రైతులు ఒప్పుకున్నట్లుగా వారితో అంగీకారపత్రాలు రాయించుకొని సంతకాలు కూడా తీసుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది. ఇల్లెందు మండలంలోని సుదిమళ్ల గ్రామంలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
రూ.3.50 లక్షల చొప్పున 35 మంది రైతులు
2017– 18లో చేపల చెరువుల నిర్మాణం కోసం గిరిజన రైతులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మంజూరు చేసింది. ఇల్లెందు మండలంలోని సుదిమళ్ల, పూబెల్లి గ్రామాలకు చెందిన 35 మంది గిరిజన రైతులు రూ.3.50 లక్షల చొప్పున డీసీసీబీ ద్వారా రుణం తీసుకున్నారు. ఇందులోంచి రూ.1.50 లక్షలను బ్యాంకర్లు డిపాజిట్ చేయించుకున్నారు. అయితే, రైతులు సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఆ డిపాజిట్ డబ్బులను రుణం కింద జమ చేసుకున్నారు.
ఇంకా ప్రతి రైతు రూ.2 లక్షల వరకు బకాయి ఉన్నట్లు బ్యాంకర్లు చెబుతుండగా, రైతులు మాత్రం రుణంగా ఇచ్చిన నగదు కంటే బ్యాంకు అధికారులు కమీషన్ల కింద తీసుకున్న వాటానే అధికంగా ఉందంటూ చెల్లింపునకు నిరాకరించారు. ప్రస్తుతం అప్పటి అధికారులు అక్కడ విధుల్లో లేరు. రైతుల రుణాలు మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత పాలకవర్గం, అధికారులు రుణాల వసూళ్లకు రంగంలోకి దిగి గిరిజన రైతులకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు.
ఇందులో కొందరు మాత్రం ఎంతోకొంత రుణం తిరిగి చెల్లించారు. పూర్తిస్థాయిలో ఏ రైతు కూడా తిరిగి చెల్లించకపోవడంతో ఇళ్లు, సామగ్రిని వేలం వేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం డీసీసీబీ ఇల్లెందు, టేకులపల్లి బ్రాంచ్ మేనేజర్లు నాగరాజు, కృష్ణ, ఇతర ఇబ్బంది సుదిమళ్లకు మందీమార్బలంతో జీపుల్లో చేరుకున్నారు. రుణాలు చెల్లించాలని, లేనిఎడల ఇళ్లలోని వస్తువులను వేలం వేస్తామని, ఇళ్లకు తాళాలు వేస్తామని మైకుల్లో హెచ్చరించారు.
రైతుల ఇళ్ల ముందు డప్పు చాటింపు వేయించారు. ఇళ్లలోని విలువైన సామగ్రిని గుర్తించి నమోదు చేసుకున్నారు. ఈ నెల 18వ తేదీలోగా రుణాలు చెల్లించకపోతే ఇల్లు జప్తు చేసుకోవచ్చని, సామగ్రిని వేలం వేసుకోవచ్చని రైతులు, వారి కుటుంబీకుల నుంచి అంగీకారపత్రం రాయించుకున్నారు. గిరిజనులం కావడంతోనే అధికారులు తమతో ఇలా వ్యవహరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నోటీసులను పట్టించుకోకపోవడంతోనే...
ఈ విషయమై డీసీసీబీ ఇల్లెందు బ్రాంచ్ మేనేజర్ నాగరాజును ‘సాక్షి’వివరణగా కోరగా అప్పు చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో డప్పు చాటింపు వేయించాల్సి వచ్చిందని తెలిపారు. గిరిజన రైతుల పేరిట మధ్యవర్తులు రుణాలు తీసుకున్నారని, ఈ క్రమంలో అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment