లగేజీ మార్పిడి కోసం జంక్షన్‌ల మధ్య ఏర్పాట్లు
ప్రయాణికుల రాకపోకలకు వాక్‌వేలు, స్కైవాక్‌లు
ప్రత్నామ్నాయాలపై హెచ్‌ఏఎంఆర్‌ఎల్ కసరత్తు
మెట్రో మొదటి, రెండో జంక్షన్‌ల అనుసంధానం
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో జంక్షన్‌ల మధ్య అనుసంధానం కోసం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) వివిధ రకాల ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేస్తోంది. ఆయా మార్గాల్లోంచి బయలుదేరే ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు జంక్షన్‌ల వద్ద ట్రెయిన్ మారాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టు నుంచి నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా జంక్షన్‌ల వద్ద మార్పు తప్పనిసరి. దీంతో లగేజీ తరలింపు సమస్యగా మారనుంది. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు లగేజీ తీసుకెళ్లడం ఎంతో కష్టం. ఈ క్రమంలో లగేజీ తరలింపుతో పాటు ప్రయాణికులు కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా స్టేషన్‌లు మారేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
లగేజీ తరలింపునకు బెల్ట్..
నగరంలోని అన్ని వైపుల నుంచి ప్రతిరోజూ కనీసం సుమారు లక్ష మందికి పైగా ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో పాటు, వారి కోసం వెళ్లే బంధుమిత్రులు, జీఎమ్మార్ ఉద్యోగులు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులతో ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం 75 వేల మంది ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తుండగా 2028లో ఎయిర్‌పోర్టు మెట్రో సేవలు ప్రారంభమయ్యే నాటికి లక్ష దాటవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో లక్ష మంది ప్రయాణికులు నిరంతరం రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా మెట్రో జంక్షన్‌ల మధ్య లగేజీ కోసం పెద్ద ఎత్తున బెల్ట్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అలాగే ప్రయాణికుల కోసం వాక్‌వేలు ఉంటాయి. ఎల్‌బీనగర్ నుంచి ఎల్‌బీనగర్ మెట్రో స్టేషన్‌కు స్కైవాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. నాగోల్ మెట్రోస్టేషన్ నుంచి నాగోల్ ఎయిర్‌పోర్ట్ మెట్రోస్టేషన్‌కు మధ్య వాక్‌వే ఉంటుంది.
ఎయిర్‌పోర్ట్ మెట్రో స్పెషల్..
మెట్రో రెండో దశలో ఎయిర్‌పోర్టు మెట్రో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. మిగతా మార్గాల్లో కంటే ఈ రూట్‌లో మెట్రో రైళ్ల వేగం కూడా ఎక్కువే ఉండనుంది. ప్రస్తుతం గంటకు 35 కిలోమీటర్‌ల వేగంతో నడుస్తుండగా, ఎయిర్‌పోర్ట్ రూట్‌లో 45 కిలోమీటర్‌ల వరకు వేగం పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వద్ద ఏర్పాటు చేసినవిధంగా 1.6 కిలోమీటర్‌లు భూగర్భ మెట్రో నిర్మించనున్నారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్ భూగర్భంలోనే ఉంటుంది. అక్కడి నుంచి ప్రయాణికులు ఎస్కలేటర్లు, లిఫ్టులను వినియోగించి ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్‌కు చేరుకుంటారు. మరోవైపు ఫోర్త్ సిటీకి మెట్రో అందుబాటులోకి వచ్చేనాటికి హైదరాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు మీదుగా ఫోర్త్‌సిటీకి రాకపోకలు సాగించే మెట్రో ప్రయాణికుల సంఖ్య 7 లక్షలు దాటవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment